భారతీయ రైల్వేను నిండా ముంచిన రెండు రైళ్లు
ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థగా భారత్ ఉంది. విశ్వవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పై ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను 13,500 రైళ్ల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అతి చౌకైన, భద్రతతో కూడిన ప్రయాణ సాధనం కావడంతో ఒకరకంగా చెప్పాలంటే భారతీయ రైల్వే భారతీయులు గుండెచప్పుడుగా మారిపోయింది. కొన్ని కొన్ని మార్గాల్లో రైల్వేకు అధిక లాభాలు వస్తుంటాయి. మరికొన్ని మార్గాల్లో నష్టాలు వస్తుంటాయి. అయినప్పటికీ ప్రయాణికుల కోసం ఆ మార్గాల్లో రైళ్లను రైల్వే నడుపుతుంది.
అత్యధిక ఆదాయం బెంగళూరు రాజధాని నుంచి
ఆదాయం పరంగా బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వరకు నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ ఏడాదికి రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైలుగా నిలిచిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు రూ.176 కోట్లను ఆర్జించిపెట్టింది. అలాగే అహ్మదాబాద్-ముంబయి, ఢిల్లీ-లక్నో మధ్య నడస్తున్న తేజస్ రైళ్లు రైల్వేకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. మూడు సంవత్సరాల కాలంలో ఈ రెండు రైళ్లు రైల్వేకు రూ.63 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వీటిని నడిపే బాధ్యతను రైల్వే ఐఆర్సీటీసీకి అప్పగించింది.

కరోనా వచ్చిన తర్వాత రైల్వేలో మార్పుచేర్పులు
కరోనా వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో అనేక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్లను ఎక్స్ ప్రెస్ లుగా మార్చడం, కొన్ని ప్యాసింజర్లను రద్దుచేయడంలాంటివి చేసింది. కరోనా తర్వాత ఈ రెండు రైళ్లకు సరైన సంఖ్యలో ప్రయాణికులు రాకపోతుండటంతో నిరంతరం కష్టాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ రైళ్లను వారానికి ఆరు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలగడంలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నడుస్తున్న తేజస్ రైళ్లవల్ల భారతీయ రైల్వేకు ఆర్థికంగా భారీ నష్టాలు కలుగుతున్నాయని అధికారులు నివేదిక అందించారు. వందేభారత్ రైళ్లు వచ్చిన సమయంలో వీటిని ఎక్కేందుకు ప్రయాణికులు మొగ్గుచూపడంలేదు. రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లకన్నా తేజస్ రైళ్లల్లోనే ఛార్జీలు ఎక్కువగా ఉండటం మరో కారణం. ఎప్పుడన్నా పండగల సమయాల్లోనే ఈ రైళ్లల్లో ప్రయాణికులు కనపడుతుంటారు. అయినప్పటికీ కనీసం 200 సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications