AP గవర్నర్ నియామకంలో ఊహించని ట్విస్ట్?
భారతీయ జనతాపార్టీ రాజకీయం తెలిసినవారుగా కచ్చితంగా ప్రయోజనం కోసమే గవర్నర్ల బదిలీలని వాదిస్తున్నారు.
ప్రతి రాష్ట్రానికి కొత్తగా గవర్నర్ల నియామకాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆశించి బదిలీ చేసింది? ఏ లక్ష్యం కోసం కొత్త గవర్నర్ వచ్చారు? దీనివల్ల ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి లాభమా? నష్టమా?.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు ఉదయించడం సహజం. ఏపీకి కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియాయకం కూడా ఇలా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. గవర్నర్ అంటేనే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తుంటారు.

బీజేపీ రాజకీయం తెలిసినవారికి ఎన్నో సందేహాలు
భారతీయ జనతాపార్టీ రాజకీయం తెలిసినవారుగా కచ్చితంగా ప్రయోజనం కోసమే బదిలీలుంటాయని వాదిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్న బీజేపీ అక్కడ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళ సై సౌందరరాజన్ ను నియమించింది. గవర్నర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య విభేదాలున్నట్లు పలు సందర్భాల్లో జరిగిన కార్యక్రమాలు వ్యక్తపరిచేవి. గవర్నర్ ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండేవి.

న్యాయమూర్తిని నియమించడంలో మతలబు?
ఏపీతో సహా 13 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఏపీకి నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ వచ్చారు. కర్ణాటకకి చెందిన ఎస్.అబ్దుల్ నజీర్ అయోధ్య రామజన్మబూమి, ట్రిపుల్ తలాఖ్, పెద్దనోట్ల రద్దు, ఆధార్ చట్టబద్దత తదితర కీలకమైన కేసులని విచారించిన ధర్మాసనాలలో సభ్యుడుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించారు. మిగిలిన రాష్ట్రాల గవర్నర్ల బదిలీల విషయాన్ని పక్కనపెడితే అసలు ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను తీసుకురావడంలో మతలబు ఏమిటి? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే?
ఆయన నియామకంవల్ల వైసీపీ, జనసేన.. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి లాభం కలగబోతోంది? అనే చర్చ ప్రారంభమైంది. సాధారణ ప్రక్రియలో భాగంగానే కొత్త గవర్నర్ నియామకం జరిగివుండవచ్చని వైసీపీ భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్ట బోతోంది. తర్వాత దీన్ని అనుమతి కోసం గవర్నర్ కు పంపిస్తారు. న్యాయ సంబంధమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించివుండవచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications