కేంద్ర కేబినెట్ లోకి పవన్ - వైఎస్ షర్మిల : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నయా స్కెచ్..!??
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. మిత్రులను పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. పాతుకుపోయిన పార్టీలకంటే..కొత్త పార్టీలతో మైత్రికి ప్రాధాన్యత ఇస్తోంది. దీని ద్వారా తమ ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇందుకోసం ఏపీలో పవన్ కల్యాణ్..తెలంగాణలో షర్మిల తో రాజకీయ బందం కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఆ ఇద్దరికీ భారీ ఆఫర్ సిద్దం చేసింది. పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఆ ఇద్దరు నేతలు అంగీకరిస్తే త్వరలోనే వారికి కీలక పదువులు ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా ఉందని విశ్వసనీయ సమాచారం.

ఏపీలో పవన్.. తెలంగాణలో వైఎస్ షర్మిల..
తెలంగాణలో 2023 ఎన్నికలను బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఏపీలో 2029 తమ టార్గెట్ గా చెబుతోంది. ఇందు కోసం ముందస్తుగానే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు.
విశాఖలో ప్రధానితో భేటీ తరువాత పవన్ రాజకీయంలోనూ మార్పు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు అంశం లోనూ పవన్ నుంచి అడుగు ముందుకు పడటం లేదు. 2014 తరహాలోనే తిరిగి మూడు పార్టీల పొత్తు జనసేన - టీడీపీ కోరుకుంటున్నాయి. బీజేపీ ససేమిరా అంటోంది. ఈ సమయంలో పవన్ కు రాష్ట్రంలో మరింత పట్టు పెరిగేలా నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇవ్వాలని భావిస్తోంది.
అందు కోసం కేంద్ర కేబినెట్ లో అకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం పవన్ అంగీకరిస్తే కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించటానికి బీజేపీ నాయకత్వం సిద్దంగా ఉందని తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ తో తల పడుతున్న బీజేపీ, తాజాగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.

కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం..
సంక్రాంతి తరువాత.. బడ్జెట్ సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తో పాటుగా తెలుగు రాష్ట్రాలకు ఈ సారి అవకాశం ఇవ్వనున్నారు. ఏపీ నుంచి పవన్ కల్యాణ్ కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
మోదీ విశాఖ కేంద్రంగా పవన్ కు ఇచ్చిన రోడ్ మ్యాప్ లో జనసేనాని పూర్తి బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా విజన్ సిద్దం చేస్తున్నారు. టీడీపీ స్థానం ఏపీలో భర్తీ చేయాలనేది బీజేపీ లక్ష్యం. అందుకు పవన్ సహకారం అవసరమ ని భావిస్తున్నారు. పవన్ అంగీకరిస్తే కేంద్ర మంత్రి పదవి సిద్దమనే ప్రతిపాదనలు పంపేందుకు రంగం సిద్దమైంది.
అందుకు జనసేనాని అంగీకరిస్తే కేంద్ర మంత్రి హోదాలో ఏపీకి సంబంధించిన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం దక్కనుంది. అయితే, 2024 ఎన్నికల వేళ టీడీపీని కాదని బీజేపీతో కొనసాగే అంశం పైన పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

షర్మిలను ఒప్పించటం సాధ్యమేనా..!?
తెలంగాణలో ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు.బీజేపీకి చెందిన మరో బీసీ నేతకు కేంద్ర కేబినెట్ లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ పై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల విషయంలో ప్రధాని సానుకూలంగా ఉన్నారని పార్టీ ముఖ్య నేతల్లో ప్రచారం సాగుతోంది.
ఈ చర్చల ఆధారంగానే షర్మిల బీజేపీ వదిలిన బాణంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే, షర్మిల తనకు బీజేపీతో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య హోరా హోరీ పోరులో కాంగ్రెస్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో, దాదాపుగా కాంగ్రెస్ - షర్మిల ఓట్ బ్యాంకు ఒకటిగానే భావిస్తున్న బీజేపీ తెలంగాణలో షర్మిలకు మద్దతు ఇవ్వటం.. మద్దతు తీసుకోవటం ద్వారా వైఎస్సార్ అభిమానులో పాటుగా..ఒక బలమైన వర్గం ఓన్ చేసుకోవచ్చని లెక్కలు కడుతోంది.
ఇందు కోసం బీజేపీ - వైఎస్పార్టీపీ మధ్య కామన్ ఫ్రెండ్స్ కు షర్మిలతో సంప్రదింపుల బాధ్యత అప్పగించినట్లు సమాచారం. అయితే, అసలు బీజేపీతో పొత్తుకు షర్మిల అంగీరించే అవకాశం లేదని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు. మరి..బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications