ఇస్రోలో తెలుగోడి సత్తా: స్కాట్‌శాట్ రూపకల్పనలో రాఘవరెడ్డి కీలకం
శ్రీహరికోట: ఎన్నో అంతరిక్ష విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కీలక భూమిక పోషిస్తున్నారు. సోమవారం పీఎస్‌ఎల్‌వీ-సీ35 ద్వారా (ఇస్రో) రోదసిలోకి ప్రవేశపెట్టిన ఎనిమిది ఉపగ్రహాల్లో స్కాట్‌శాట్ ఎంతో కీలకమైంది. ఈ సెటిలైట్ ద్వారా ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి నష్టాన్ని తగ్గించవచ్చు.
ఈ కీలకమైన బహుళ ప్రయోజనకరమైన ఉపగ్రహాన్ని రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు వ్యక్తి ముఖ్యపాత్ర పోషించారు. ఆయనే ఓగిరెడ్డి వెంకటరాఘవరెడ్డి. అంతేగాక, ఆయనే ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ కూడా.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో సుబ్బారెడ్డి, నాగియమ్మ దంపతులకు ఆయన జన్మించారు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబమైనా.. కుమారుడికి చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించి కాకినాడలో పాలిటెక్నిక్ చదివించారు సుబ్బారెడ్డి. తల్లిదండ్రుల శ్రమను గుర్తించి రాఘవరెడ్డి కూడా విద్యాభ్యాసంలో ఎప్పుడూ ముందుండేవాడు.
అదే పట్టుదలతో ఢిల్లీలో ఐఈటీఇలో చేరి బీటెక్ పూర్తి చేశాడు. ఇంకా చదవాలన్న తపనతో వరంగల్ వెళ్లి ఆర్‌ఈసీలో ఎంటెక్ పూర్తి చేశాడు. దీంతో బెంగుళూరు ఉపగ్రహ తయారీ కేంద్రంలో 1983లో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇష్టమైన రంగం కావడంతో ఉపగ్రహాల తయారీలో చురుకుగా పాల్గొనేవాడు.

ఈ విధంగా ఓషనశాట్-1, ఓషనశాట్-2, సరల్, ఇనశాట్ ఉపగ్రహాల తయారీలో కీలకభూమిక పోషించారు రాఘవరెడ్డి. ఈ క్రమంలోనే ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇస్రోలో ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ పదవి వరించింది.
కాగా, ఆ సమయంలో అంటే 2014లో ప్రయోగించిన ఓషనశాట్‌లో కలిగిన సాంకేతిక లోపంతో దాని సేవలు ఆగిపోయాయి.
వెంటనే ఆ స్థానంలో మరో ఉపగ్రహం ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీని స్థానంలో మరో ఉపగ్రహాన్ని రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా రాఘవరెడ్డి నేతృత్యంలో స్కాట్‌శాట్-1 రూపుదిద్దుకుంది. రాఘవరెడ్డి నేతృత్వంలో కేవలం 18నెలల్లోనే దీనిని తయారుచేయడం గమనార్హం. అంతేగాక, రూ.150 కోట్లు ఖర్చుఅయ్యే ఉపగ్రహ తయారీని కేవలం రూ. 80 కోట్లతోనే పూర్తిచేశారు.
ఇస్రో పీఎస్ఎల్వీ -35ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల రాఘవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్కాట్ శాట్-1 ఉపగ్రహం జాతికి ఉపయోగపడే ఉపగ్రహమని అన్నారు. తుఫానల దిశ, గమనాన్ని కచ్చితంగా గుర్తించి సమాచారాన్ని చేరవేస్తుందని తెలిపారు. సమర్థంగా పని చేస్తుందనే నమ్మకం తనకుందన్న ఆయన... ప్రస్తుతం ఓషనశాట్-3 ఉపగ్రహాన్ని తయారుచేసే ప్రయత్నంలో ఉన్నామని వివరించారు.












Click it and Unblock the Notifications