20 కోట్లు ఇస్తామన్నారు: టీడీపీ 'ఆకర్ష్'పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచనలం
హైదరాబాద్: ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ఆపరేషర్ ఆకర్ష్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారితే రూ. 20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వైసీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడించారు.
మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పార్టీ మారితే రూ. 20 కోట్లు ఇస్తామని టీడీపీ నేతలు తనను ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. అయితే తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశానని కూడా ఆమె పేర్కొన్నారు.

ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని, చివరివరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోని వచ్చానని చెప్పారు.
విశ్వసనీయతతో పనిచేస్తానని, రాజకీయాల్లో కొనసాగినంతకాలం జగనన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు.
టీడీపీని జనాలు ఛీ కొడతారు: గిడ్డి ఈశ్వరి
''ఎప్పటికైనా టీడీపీ... ఓ మునిగే పడవ. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలి? అలా చేస్తే జనాలు ఛీ కొడతారు'' అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్'పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ టికెట్ పై గెలిచిన వంతల రాజేశ్వరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారని, అందుకు వారు రూ.20 కోట్లు ఎరగా వేశారని ఆమె ఆరోపించారు. రూ.20 కోట్లు కాదు కదా, రూ.100 కోట్లిచ్చినా తాము వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు.
చివరిదాగా వైసీపీలోనే కొనసాగుతామని కూడా ఆమె స్పష్టం చేశారు. వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ ఆపరేషన్‌కు తెర తీసిందని ఆమె ఆరోపించారు. గిరిజన బిడ్డలమైన తాము జగన్ వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని ఆమె చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కవగా ఉన్నారని, వారిని లాక్కునేందుకే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు కుట్రలకు స్వస్తి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications