శ్రీవారు- పద్మావతి అమ్మవారి కానుకలు: టీటీడీ కొత్త స్కీం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 75,183 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,906 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది టీటీడీ. ఆ రోజున హిందూ ధర్మ ప్రచార పరిషత్ తో కలిసి యుక్తంగా సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సౌభాగ్యం సామాగ్రికి శ్వేతా భవనంలోని హాలులో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ, ధర్మప్రచార పరిషత్ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వాటిని ఆయా ఆలయాలకు పంపించనున్నారు టీటీడీ అధికారులు.
వరలక్ష్మీ వ్రతం రోజున టీటీడీ ఆలయాల్లో సౌభాగ్యం పేరుతో గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేయనున్నారుె. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించారు. విరాళం అందించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు తరలించారు.












Click it and Unblock the Notifications