వారికి చంద్రబాబు భయపడటం వెనుక..: ఎందుకో చెప్పిన వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. నవ నిర్మాణ దీక్షను జగన్‌ను తిట్టేందుకు ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి, తెలంగాణ సీఎం కెసీఆర్‌కు ఎందుకు భయపడతారో తెలుసునని అన్నారు.
ప్రతి దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కడప వాళ్లు వచ్చారని, కడప వాళ్లు పంపించారని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. టిడిపి నేతలు నిత్యం తమ పార్టీ అధినేత జగన్‌ను ఆడిపోసుకుంటున్నారని చెప్పారు.
జగన్ పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. నేను కేసీఆర్‌కు ఎందుకు భయపడతానని, ప్రధాని మోడీకి ఎందుకు భయపడతాని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన భయపడటం లేదని చెప్పడం లేదని, కానీ ఎందుకు భయపడతానని ప్రశ్నిస్తున్నారన్నారు.

మీరు ప్రధాని మోడీకి ఎందుకు భయపడతారంటే.. ఈ రెండేళ్లలో మీరు చేసిన అవినీతి పైన కేంద్రం విచారణ జరుపుతుందనే భయంతో భయపడుతున్నారన్నారు. మీ అవినీతిని కేంద్రం సహించే పరిస్థితి లేదు కాబట్టి భయపడుతున్నారన్నారు.
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో మీరు ఫోన్లో 'బ్రీఫ్డ్ మి' అని చెప్పి దొరికిపోయారన్నారు. మీరు భయపడటం వల్లనే రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. కడపలో ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేశారని వ్యాఖ్యానించారు.
కడపలో సభ పెట్టింది వైయస్ జగన్‌ను తిట్టేందుకేనా అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో మీరు సాధించిందేమిటో చెప్పాలన్నారు. చెప్పులతో, చీపుర్లతో కొట్టమన్నందుకు మీరు బాధపడ్డారా అని ప్రశ్నించారు. ఆయినా జగన్ కొట్టమని చెప్పలేదని, హామీలు నెరవేర్చని వారిని చెప్పులతో కొట్టాలని చెప్పారన్నారు.
టిడిపి అవినీతి పైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు హామీలు ఇచ్చారని, అందులో ఒక్క హామీ అయినా నెరవేరిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి అబద్దాలు ఆడవచ్చా అని చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేయవచ్చా అని ప్రశ్నించారు. మీ తమ్ముడిని మోసం చేయవచ్చు, మరొకరిని మోసం చేయవచ్చు.. కానీ సీఎంగా రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేస్తారని ప్రశ్నించారు. ఆ హామీలనే జగన్ ప్రశ్నిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications