వీరప్పన్ అనుచరుడి అరెస్ట్: భారీగా ఎర్రచందనం దుంగలు సీజ్
కడప: జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లి గ్రామం వద్ద లక్కిరెడ్డిపల్లె పోలీసులు, ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు పోలీసులు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్, వీరప్పన్ అనుచరుడు అస్లం ఖాన్ (56)ను అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు వివరాలను కడప ఓఎస్డీ సత్య ఏసుబాబు మీడయాకు తెలిపారు. అస్లంఖాన్.. కరడు గట్టిన స్మగ్లర్ వీరప్పన్ బతికి ఉన్న రోజుల్లో అతనితో కలిసి చందనం చెట్లను స్మగ్లింగ్ చేసే వాడని తెలిపారు. అస్లంను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కర్ణాటకకు చెందిన అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అస్లం ఖాన్‌ను అరెస్టు చేశామన్నారు. ఇతనిపై ఒక్క కడప జిల్లాలోనే 18 కేసులున్నాయని చెప్పారు. గత 20-25 సంవత్సరాల నుంచి కరడుగట్టిన చందనం స్మగ్లర్ అన్సర్‌ఖాన్(మరణించాడు), వీరప్పన్‌లతో కలిసి అస్లంఖాన్ స్మగ్లింగ్ చేసేవాడు.
1998-99 నుంచి చందనం కొరత కారణంగా దాన్ని వదిలేసి ఎర్రచందనం అక్రమ రవాణాలోకి దిగాడు. ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేశాడు. ఇతను చెన్నైకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లకు దుంగలను అక్రమంగా సరఫరా చేసే వాడని ఓఎస్డీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications