రాధా ఇష్యూలో వైసీపీ డిసైడ్ అయిపోయిందా - చీప్ రాజకీయాలు చేస్తారా : మంత్రి వెల్లంపల్లి..!!
వంగవీటి రాధా కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వంగవీటి రంగా రెక్కీ వ్యాఖ్యలు.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ తరువాత మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేసారు. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని డిమాండ్ చేసారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా చెప్పాలన్నారు. రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదు ఆయన అన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

కారు తిరిగితే రెక్కీ అవుతుందా
వంగవీటి మోహన్ రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారో రాధా తెలుసుకోవాలని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని విమర్శించారు. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా అంటూ మంత్రి ప్రశ్నించారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది.. అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా అంటూ మంత్రి నిలదీసారు. హత్యా, రెక్కీ అంటారు.. భద్రత కోసం గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తున్నరని వెల్లంపల్లి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు పరామర్శత తరువాత
రాధా రెక్కీ అంశంపై వెంటనే సీఎం జగన్ స్పందించారని, రాధా తమ పార్టీకి సంబందంలేని వ్యక్తయినా గన్ మెన్లను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాధాను చంద్రబాబు పరామర్శించడం దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగానట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. దీని ద్వారా వైసీపీ రాధా విషయంలో తన స్టాండ్ మార్చుకుందా అనే చర్చ మొదలైంది.

ఇక వైసీపీలోకి రారని డిసైడ్ అయ్యారా
ఇప్పటి వరకూ మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ మిత్రుడు వంగవీటి రాధాను తిరిగి వైసీపీ గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు వారి ప్రయత్నాలకు గండి కొట్టేందుకు నేరుగా రాధా ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారు. దీంతో..ఇక, ఇప్పుడు వైసీపీ రాధాను టార్గెట్ చేయటం ప్రారంభించింది. రెక్కీ అంశం పైన ఒక్క సారిగా సీరియస్ వ్యాఖ్యలు మొదలు పెట్టింది. దీంతో..ఇప్పుడు రాధా రాజకీయ అడుగులు ఎటువైపు అనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications