ఎపికి ప్రత్యేక హోదా: వెంకయ్య, ఒత్తిడి తెస్తామని సుజనా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడంతోనే విభజనచట్టంలో ప్రత్యేక హోదా చేర్చ లేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఏపీ విభజన చట్టం అమలు పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరగా, అదనపు కార్యదర్శి ఏకేసింగ్‌ను నోడల్ అధికారిగా నియమించేందుకు రాజ్‌నాథ్ అంగీకరించారని వెంకయ్యనాయుడు తెలిపారు.
ఇదిలావుంటే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పని తాము చేస్తున్నామని కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని టీడీపీ ఎంపీలు మురళీమోహన్, జేసీ దివాకర్‌రెడ్డిలు అన్నారు.

గురువారం ఢిల్లీలో సుజనాచౌదరి నివాసంలో టీడీపీ, బీజేపీ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇచ్చిన దానిమీద ఇంకా ఏమేమి అనుసరించాలన్న దానిపై కూడా చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. ఏపీకి కొన్ని మాత్రమే ఇచ్చారని, మిగిలినవి ఏ విధంగా డిమాండ్ చేసి, చట్టపరంగా రాబట్టాలన్న దానిపై కూడా చర్చలు జరిపినట్లు సుజనా చౌదరి వెల్లడించారు.
కేంద్ర మంత్రి సుజనాచౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలు గురువారం సమావేశమయ్యారు. ఉభయసభలకు చెందిన టీడీపీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విభజన చట్టంలో ఏపీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. విభజన చట్టం అమలులో కేంద్రపై ఒత్తిడి తెచ్చే అంశంపై అలాగే మరోసారి కేంద్రమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కోరామని ఎంపీ హరిబాబు చెప్పారు. విశాఖలో సీజీహెచ్‌ను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి జేపీ నడ్డా, హోంశాఖ నియమించిన అధికారి ఏకెసింగ్‌లు రాష్ట్రంలో పర్యటించాలని కోరామని ఆయన చెప్పారు. హామీల అమలుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications