పెద్దాయన (ఎన్టీఆర్) బాధపడుతున్నారని ఫోన్: బెజవాడ ఆత్మీయ సభలో వెంకయ్య
హైదరాబాద్: రాజ్యసభకు నాల్గొసారి ఎన్నికై విజయవాడకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
1979 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని రంగంలోకి దించిందని ఆయన చెప్పారు. అప్పటి వరకు తన నియోజకవర్గ ప్రజలు హెలికాప్టర్, కార్లు చూళ్లేదని, అయినప్పటికీ వారు తనను గెలిపించారని చెప్పారు.
ఆ తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతోందని, అలాంటి సమయంలో ఒక రోజు అర్ద రాత్రి డాక్టర్ వెంకటేశ్వరరావు తండ్రిగారు చెంచురామయ్యగారి నుంచి ఫోన్ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఏంటి సార్ అనగానే... నాయుడు పెద్దాయన (ఎన్టీఆర్) షెడ్యూల్ చేసుకోలేదట... ప్రచారంలో భాగంగా నీ నియోజకవర్గంలో ఒక ఊరు ఉంది, ఆయన మిమ్మల్ని, జైపాల్ రెడ్డిని సభలో ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్రచారం చేయాలంటే ఆయన ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
పోనీలే ఆ ఊరిని తప్పించేసి వెళ్లిపొమ్మంటావా? అని అన్నారని వెంకయ్య ఈ సందర్భంగా చెప్పారు. అప్పుడు తాను అలా చేయకండి, మీరు అలా చేస్తే ఎన్టీఆర్ వల్ల గెలిచానని నేను మధనపడాలి, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు...మీ ప్రచారం మీరు చేసుకోండి, నా పని నేనే చూసుకుంటానని ఆయనకు సమాధానం చెప్పానని అన్నారు.
ఆ రోజు జరిగిన సభకు భారీ ఎత్తున జనాలు వచ్చారని, అదో అద్భుతమైన సభ అని ఆయన గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాదు, పరోక్ష రాజకీయాలు కూడా కొత్త కాదని ఆయన చెప్పారు.
ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పోడిచినప్పుడు... ఆయన నటుడనో లేక, ఫేమ్ ఉందనో ఆయనకు మద్దతు తెలపలేదని అన్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని, జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఈ సన్మాన కార్యక్రమంలో చంద్రబాబుతో సహా స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, దేవినేని, పత్తిపాటి, రావెల కిషోర్ బాబు, ఎంపీలు రాయపాటి, కేశినేని నాని, గోకరాజు గంగరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications