ఇదేనా శృంగారం?: మీడియా, సినిమాలపై వెంకయ్య
విజయవాడ: ప్రస్తుత మీడియా, చలన చిత్రాలు శృంగారం పేరుతో అంగాంగాన్ని ప్రదర్శిస్తూ విచ్చలవిడి తనాన్ని చూపుతున్నాయి తప్ప విషయం ఉండటం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం విజయవాడలో సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాకు చురకలు అంటించారు. అలనాటి సినిమాల్లో సంప్రదాయ బద్ధంగా, అందంగా శృంగారాన్ని చూపించేవారని అన్నారు.
ప్రస్తుత సినిమాల్లో ఒకరి మీద ఒకరు పడటం, అంగాంగాన్ని చూపడం తప్ప శృంగారం అనే భావన కలిగించేలా సన్నివేశాలు ఉండటం లేదని అన్నారు. అలనాటి సినిమాల్లో సాహిత్య విలువలు, నటనా కౌశలం కొట్టొచ్చినట్లు కనిపించేవని వెంకయ్య అన్నారు. తమ నటన కౌశలంతో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్ర వంటి వారు మహానటులుగా ఎదిగారని అన్నారు. ఇప్పుడు అలాంటి నటులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.

టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని, రేటింగ్ పోటీ మంచిది కాదని వెంకయ్య నాయుడు అన్నారు. సత్యానికి దగ్గరగా, సంచలనానకి దూరంగా మీడియా పనితీరు ఉండాలని ఆకాంక్షించారు. వార్తలను వార్తలుగా, వ్యాఖ్యానాలను వ్యాఖ్యానంగానే చూపాలని సూచించారు.
టీవీ మీడియా విజ్ఞానం పెంపొందించుకునేందుకు, ఆనందంగా ఉంచేందుకు నిబద్ధతతో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. దూరదర్శన్‌లో దేశ వ్యాప్తంగా మొత్తం 1417 ట్రాన్స్ మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications