పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: సుజన అలా, వెంకయ్య ఇలా, బాబుకు తెలిసే
విజయవాడ: ప్రత్యేక హోదా పైన బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మాట మారింది. నిన్నటి దాకా ప్రత్యేక హోదా సాధిస్తాం, ఇస్తాం అన్న నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదాతో వచ్చేదేమీ లేదని, లాభం కంటే నష్టమే ఎక్కువ అని, హోదాతో ప్రతి గ్రామం హైదరాబాద్ కాదు అని చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ తేల్చింది. ఆదివారం నాడు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు, టిడిపి నేత, మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యల ద్వారా అది మరింత స్పష్టమైంది. హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి నలభై ఏళ్లు పట్టిందని, ఇప్పుడు హోదా ఇస్తే ఏపీలోని ప్రతి గ్రామం హైదరాబాద్ అవుతుందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారన్నారు.
ఆదివారం ఉదయం వెంకయ్య అలా మాట్లాడగా, సాయంత్రం సుజన మాట్లాడుతూ.. హోదా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పారు. కేంద్రం మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు. హోదా తెస్తాం, ఇస్తామని చెప్పిన టిడిపి, బిజెపి నేతల మాటల్లో తేడా కనిపించడంతో విపక్షాలు మండిపడుతున్నాయి.

పవన్ ప్రభావంతో మొత్తానికి తేల్చేశారు
ప్రత్యేక హోదా పైన విపక్షాలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఇస్తాం, తెస్తామని అధికార పార్టీలు చెప్పుకొచ్చాయి. పరోక్షంగా ఇవ్వలేమని తేల్చి చెప్పినప్పటికీ.. మాటల ద్వారా ఆశలు కూడా రేపాయి. హోదా ఇవ్వమని ఇంకా తేల్చి చెప్పలేదని అధికార పార్టీ నేతలు చెప్పేవారు.
అయితే, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయనే మాటల నుంచి హోదా వల్ల వచ్చేదేమీ లేదని చెప్పే వరకు వచ్చారు. వెంకయ్య, సుజనా చౌదరిల వ్యాఖ్యల పైన విపక్షాలు, ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.
అదే సమయంలో ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య, సుజనా చౌదరిలు చెప్పినవి కొంత భిన్నంగా ఉండటం గమనార్హం. ప్యాకేజీని స్వీకరిస్తామని, అలాగే హోదా మన హక్కు దానిని అడుగుతామని చంద్రబాబు చెప్పగా, హోదాతో లాభం కన్నా నష్టమే ఎక్కువ అని సుజన చెప్పారు. హోదాతో ప్రతి ఊరు హైదరాబాద్ కాదని వెంకయ్య అన్నారు. అయితే, హోదాతో కొన్ని ప్రయోజనాలు నిజమేనని అన్నారు.
పవన్ తిరుపతి సభ అనంతరం ప్యాకేజీ పైన ఢిల్లీలో చర్చోపచర్చలుల జరిగాయి. ఆ సమయంలో చర్చల్లో సుజనా చౌదరి కీలకంగా కనిపించారు. సుజనా కూడా ఢిల్లీలో చర్చల ఉద్దేశ్యాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలిపారు. అలాంటి సుజనా హోదా వల్ల లాభం కన్నా నష్టమే చెప్పడం చంద్రబాబుకు తెలిసే జరిగి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications