ఖుషి రివ్యూ: విజయ్ దేవరకొండ, సమంతల మ్యాజిక్ ఎలా ఉంది?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, సచిన్ ఖేడ్కర్, శరణ్య పొన్నవణ్నన్, మురళీశర్మ, రోహిణి, వెన్నెల కిషోర్, జయరాం, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగారు తదితరులు నటించారు.
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
సంచలన విజయాల్ని సొంతం చేసుకొని తనదైన ముద్ర కనపరిచిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో జాతీయస్థాయిలో ప్రభావం చూపించాలని ప్రయత్నించారు. అయితే అది ఫలితాన్నివ్వలేదు. దీంతో ఒక ప్రేమకథతో ఈసారి ముందుకొచ్చారు. సమంత కథానాయిక. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

జంట ప్రేమ, వివాహం నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రేమ కథల్లో ధనిక, పేద, పరువు, ప్రతిష్ట, కులం, మతం వంటివి సంఘర్షణకు కారణమవుతాయి. ఈ కథ కూడా అలాంటిదే. కాకపోతే ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల నమ్మకాల మధ్య దర్శకుడు సంఘర్షణ సృష్టించారు. సినిమా తొలిభాగం ప్రేమకథతోసాగుతుంది. తర్వాత భాగం వైవాహిక జీవితం చుట్టూ సాగుతుంది.
ఈ సినిమాకు ప్రధాన బలం కొత్త నేపథ్యం. పాత్రలు పరిచయమైన తర్వాత కథ కాశ్మీర్ చేరుతుంది. హీరోహీరోయిన్లు ఒకరికొకరు ఎదురుపడటం.. ప్రేమ.. పాటలు.. అందాలొలికించే కాశ్మీర్ తో సినిమా సాగుతుంది. విజయ్ దేవరకొండ - వెన్నెల కిషోర్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు తొలిభాగానికి ప్రధాన బలంగా మారాయి. రెండో భాగంలో అసలు సంఘర్షణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య అపార్థాలు ఎందుకు వస్తాయి? కారణమేంటి? భిన్న సంప్రదాయాలు, కట్టుబాట్లతో మెలిగే కుటుంబాల నుంచి వచ్చినప్పుడు అవి ఇంకెత ప్రభావం చూపిస్తాయనేది రెండో భాగంంలో చూపించారు.

ప్రేమకథ చూసిందే అయినా నేపథ్యం మాత్రం కొత్తగా ఉంటుంది. సంఘర్షణ, భావోద్వేగాలను పండించే ప్రయత్నం జరిగింది. అయితే సంఘర్షణ మోతాదు సరిపోలేదు. అటు ప్రేమికులకు, ఇటు భార్యాభర్తలకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా తక్కువ. తొలి భాగం హాయిగా సాగినా రెండోభాగంలో సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి. ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగే హడావిడి, కేరళలోని సన్నివేశాలు వృథా అనిపిస్తాయి.
హీరోయిన్ కి మిస్ క్యారేజ్ అయిన తర్వాత కూడా హీరోకి టెస్టుల పేరుతో తెరపై హడావిడి చూపించడం నప్పలేదు. విజయ్-సమంత మధ్య అపార్థాలు కూడా అంత ప్రభావం చూపించవు. క్లైమాక్స్ సన్నివేశాలతోనే దర్శకుడు శివ పట్టు ప్రదర్శించారు. కుటుంబంతో కలిసి చూసే కథే అయినా విజయ్ దేవరకొండ మార్క్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడ్డారు. ఆరాధ్య పాటలో విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రభావాన్ని చూపుతుంది.

వీరిద్దరి జోడి ప్రతి సన్నివేశంలోను ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్లు సరిగ్గా ఎన్నుకున్నారు. తొలి భాగంలో ప్రేమలో పడిన జంటగా, రెండో భాగంలో భార్యాభర్తలుగా ఇద్దరూ చాలా సహజంగా ఒదిగిపోయారు. క్లైమాక్స్, దానికి ముందు సన్నివేశాల్లోను చక్కటి భావోద్వేగాలను పండించారు. మురళీశర్మ, సచిన్ ఖేడ్ కర్ పాత్రలు సినిమాకు చాలా కీలకం. ఒకరు నాస్తికుడిగా, మరొకరు ప్రవచనకర్తగా నటించారు. తొలిభాగంలో వెన్నల కిషోర్, మలిభాగంలో రాహుల్ రామకృష్ణ నవ్వులు పంచారు. అలీ, బ్రహ్మానందం, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటులున్నప్పటికీ ఆశించినస్థాయిలో కామెడీ పండలేదు.
ఈ చిత్రానికి సంగీతం ప్రధాన బలం. శత్రు భిన్నమైన పాత్ర చేశాడు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. కశ్మీర్ అందాల్ని, జోడీ కెమిస్ట్రీని ఆకట్టుకునేలా చూపించారు. పాటలు కూడా రాసిన దర్శకుడు శివ కథ, స్క్రీన్ ప్లే పై కూడా ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. రెండో భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు పాత్రల మధ్య కొరవడిన సంఘర్షణ కూడా ఈ సినిమాకు బలహీనతగా మారాయి. పాటలు, కుటుంబ నేపథ్యం, విజయ్-సమంత జోడి, కాశ్మీర్ నేపథ్యంలో కథ సాగడం ఈ సినిమాకు బలం.












Click it and Unblock the Notifications