సనత్‌నగర్ మర్రి శశిధర్‌కే: మెదక్ నుంచి రాములమ్మ
హైదరాబాద్: విజయశాంతిని శాసనసభకే పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించింది. అయితే సనత్ నగర్ టికెట్ ఇస్తారని భావించినప్పటికీ మెదక్ శాసనసభ సీటును కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. సనత్‌నగర్ సీటు నుంచి మారడానికి మర్రి శశిధర్ రెడ్డి నిరాకరించడంతో అధిష్టానం విజయశాంతిని మెదక్ నుంచి పోటీకి దించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తొలి వార్తలు ఇలా ఉన్నాయి - సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ శాసనసభా నియోజకవర్గం నుంచి సినీ నటి, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెదక్ లోకసభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విజయశాంతి ఇటీవల కాంగ్రెసు పార్టీలో చేరారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంతం అభ్యర్థుల జాబితా నేడు, రేపు అంటూ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. సోమవారంనాడు కాంగ్రెసు అభ్యర్థుల జాబితాకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. విజయశాంతికి సనత్‌నగర్ అసెంబ్లీ సీటును కేటాయించినట్లు సమాచారం.

దాంతో సిట్టింగ్ కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కాగా, సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్, తెరాస నుంచి టి. పద్మారావు పోటీ చేస్తున్నారు.
ఇప్పటి వరకు మెదక్ లోకసభ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తారని భావిస్తూ వచ్చారు. కానీ, ఆమెను శాసనసభకే పోటీకి దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications