ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం-నలుగురు నిందితులకు షాక్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ పలువురు కీలక నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు జైలుకు కూడా పంపింది. త్వరలో మరికొన్ని పెద్ద తలకాయల్ని సైతం అరెస్టు చేయొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు.. ఇప్పటికే అరెస్టు చేసిన నలుగురు నిందితులకు షాకిచ్చింది.
మద్యం స్కాంలో సీఐడీ అరెస్టు చేసిన నలుగురు కీలక నిందితులు రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే పోలీసుల విచారణలో వీరు నోరు విప్పకపోవడం, కొన్ని వివరాలు మాత్రమే బయటపెట్టిన నేపథ్యంలో వీరికి ప్రత్యేకంగా విచారించేందుకు వీలుగా రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.

రేపటి నుంచి రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు మద్యం స్కాంలో ఏం జరిగిందనే విషయాన్ని రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వీరంతా ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ పై ఉన్నారు. వీరిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విచారణ జరిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లాయర్ల సమక్షంలోనే వీరిని విచారించాలని సీఐడీ అధికారులకు షరతు పెట్టింది.
మరోవైపు లిక్కర్ స్కాంలో డబ్బు అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్లిందన్న విషయాన్ని ఇప్పటివరకూ సీఐడీ రాబట్టలేకపోయింది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి వంటి నిందితులు అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దలకు చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణలో వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐడీ ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు ఇప్పుడు నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనుంది.












Click it and Unblock the Notifications