దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి, సీఎం విజయ్!
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈసారి సరికొత్త ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నాయి. కోట్లాది మంది భక్తులు ఆరాధించే కనకదుర్గమ్మ సన్నిధికి.. దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్ర మంత్రులు విచ్చేస్తుండటంతో విజయవాడ ఉత్సవాలకు అపూర్వ ప్రాధాన్యత సంతరించుకుంది. అటు భక్తుల రద్దీ, ఇటు వీఐపీల పర్యటనల నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇంద్రకీలాద్రిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు రంగంలోకి దిగారు.
అమ్మవారి సేవలో 'రాష్ట్రపతి'.. విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానాలు!
ఈ నెల 14న రాష్ట్రపతి విజయవాడ రానున్నారు. రెండ్రోజుల పాటు ఆమె ఇక్కడే బసచేయనున్నారు. ముందుగా 14న ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనుండగా, 15న నగరంలో ఏర్పాటు చేసిన సరస్ మేళాను ఆమె ప్రారంభించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికే కాకుండా విజయవాడ నగరానికి గొప్ప గర్వకారణమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. 16న మూలా నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

సీఎం విజయ్ కు ఆహ్వానం..
మరోవైపు 'విజయవాడ ఉత్సవ్ 2.0'ను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, హరీష్ బాలయోగి చెన్నైలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీలను కూడా మంత్రి సత్యకుమార్, ఎంపీల బృందం కలసి ఈ ఉత్సవాలకు ఆహ్వాన పత్రికలు అందజేసింది.
25 లక్షల మంది భక్తులు.. సామాన్యులే కేంద్ర బిందువు!
ఈ దసరా ఉత్సవాలకు దాదాపు 25 లక్షల మంది భక్తులు తరలివస్తారని, రోజుకు సగటున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చే అవకాశముందని యంత్రాంగం అంచనా వేస్తోంది. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా మూడు ప్రదేశాల్లో 'హోల్డింగ్ ఏరియాలు' ఏర్పాటు చేసి, అక్కడ 30 వేల మంది వేచి ఉండేలా వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ వేచి ఉండే భక్తులకు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, ప్రసాదం, సాంబార్ అన్నం, పెరుగు అన్నం పంపిణీ చేయనున్నారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హైటెక్ భద్రత.. 'అస్త్రం' యాప్, 500 సీసీ కెమెరాలు!
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు అధునాతన సాంకేతికతతో 'టెక్ దసరా'ను నిర్వహిస్తున్నారు. కొండపైనా, దిగువనా 500 సీసీ కెమెరాలతో కంటికి రెప్పలా నిఘా ఉంచుతున్నట్లు హోంమంత్రి అనిత, సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 'అస్త్రం' యాప్‌ను వినియోగిస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీశా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, భక్తులకు సేవలు అందించే సిబ్బంది సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా భక్తుల భద్రతే ధ్యేయంగా సన్నద్ధమవుతున్నాయి.














Click it and Unblock the Notifications
