ప్రతీ షో కు వంద టిక్కెట్లు పంపండి - వైసీపీ కార్యకర్తలతో ఒత్తిడి : మేయర్ లేఖ కలకలం..!!
ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు సినీ పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహారం సాగింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించటంతో ప్రభుత్వం పైన ఒత్తిడి..విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఆ తరువాత చిరంజీవి నాయకత్వంలని హీరోల టీం నేరుగా సీఎం జగన్ తో చర్చల తరువాత టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఈ వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలో మరో కొత్త అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సినిమా థియేటర్లకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లేఖ రాశారు.

స్వయంగా మేయర్ లేఖతో
సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 టికెట్లు పంపాలని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని, అందుకు అయ్యే డబ్బులు చెల్లిస్తామని లేఖలో రాసాకొచ్చారు. నగరంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లకూ ఈ లేఖలు పంపారు. ఈ లేఖ చూసిన మల్టీప్లెక్స్ యజమానులు విస్తుపోతున్నారు. మల్టీ ప్లెక్స్ స్క్రీన్లలో 200 నుంచి 250 వరకు సీటింగ్ ఉంటుంది.

విస్తు పోయిన మల్టీప్లెక్సుల యజమానులు
తొలి రోజు అన్ని షో లకు వంద టిక్కెట్లు మేయర్ కోరిన విధంగా ఇస్తే..తమకు విక్రయించుకోవటానికి ఏమీ మిగలవని వాపోతున్నారు. ఇప్పటి వరకు తమకు అధికారికంగా ఎవరి హాయంలోనూ ఇటువంటి లేఖలు రాలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖలో ఆ వంద టిక్కెట్లు వైసీపీ కార్యకర్తల కోసమే అని చెప్పటం ద్వారా రాజకీయంగానూ విమర్శలు మొదలయ్యాయి. ఏపీలో తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం అయిదు షో లకు అనుమతి ఇచ్చారు. అయితే, కొన్ని కండీషన్లను అందులో ప్రస్తావించారు.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో
టిక్కెట్ ధరల పెంపు పైన హీరోలతో పాటుగా దర్శకులు సైతం హర్షం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విడుదలయ్యే ప్రతీ కొత్త సినిమాకు అయిదో షో ప్రదర్శనకు వీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏ హీరో సినిమా అయినా..అయిదో షో ప్రదర్శనకు థియేటర్లకు వెసులుబాటు కలుగుతోంది. ఇప్పుడు చర్చకు కారణమైన విజయవాడ మేయర్ లేఖల వ్యవహారం పైన ఏ రకంగా స్పందన ఉంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications