MP కేశినేనిని 'అతని' చేతుల్లో పెట్టిన చంద్రబాబు!
ఎంపీ కేశినేని నానితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను టీడీపీ అధిష్టానం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగించింది.
విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని వ్యవహారశైలి చాలారోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. ఇటీవలే వరుసగా మూడురోజులపాటు నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం కలిగించాయి. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించకపోతే అంతిమంగా పార్టీకి నష్టమని భావించిన అధిష్టానం కేశినేనితో మాట్లాడి అతన్ని బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగించారు.

ధూళిపాళ్ల నరేంద్రపై సమన్వయ బాధ్యత!
విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి పర్యవేక్షకుడిగా పార్టీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. కేశినేనికి, ధూళిపాళ్లకు సన్నిహిత సంబంధాలున్నాయి. నాని దూకుడుకు బ్రేకులు పడాలంటే నరేంద్రే సరైన వ్యక్తి అనే అభిప్రాయంలో పార్టీలో వినపడుతోంది. కేశినేనితో మాట్లాడి, అతన్ని వివాదాలకు దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవడానికి నరేంద్ర ముందుకు రావడంలేదా? లేదంటే అధిష్టానం ఇంకా ఆదేశాలివ్వలేదా? అనే సందిగ్ధత కొనసాగుతోంది.

అధిష్టానాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు?
పార్టీని, నాయకులను, చివరకు అధిష్టానాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేవిధంగా కేశినేని వ్యాఖ్యానిస్తున్నప్పటికీ అక్కడి నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న నాయకులు సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదనే చర్చ పార్టీలో జరిగింది. ఏ నియోజకవర్గంలోనైనా అక్కడి నేత పార్టీపై, అధిష్టానంపై విమర్శలు చేస్తే ఆ నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో కేశినేనితో మాట్లాడే బాధ్యతను ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగించారు. అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల వద్ద కూడా కేశినేని పార్టీ పెద్దలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం.. వారు వాటిని హై కమాండ్ కు చేరవేయడం జరిగింది. నాని విషయంలో చంద్రబాబునాయుడు, మరికొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

నానిలో మార్పు కనపడటంలేదని భావిస్తున్నారు..!
ఇటీవలే కేశినేనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ నానిలో మార్పు కనపడటంలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడి బుజ్జగించిన తర్వాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉంటారనే నమ్మకం కలగడంలేదంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో నానికి మొదటినుంచి వైరం ఉందని, అసలు సమస్య కనుక్కొని వీరందరినీ ఒకచోటకు చేర్పించి మాట్లాడించడమొక్కటే పరిష్కారమని మరికొందరు సూచిస్తున్నారు. నానికి అతని సోదరుడు చిన్ని, దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా తదితర నాయకులతో సన్నిహిత సంబంధాలు లేవు. నానిమీద వారు, వారిమీద నాని చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ పరువు పోతుందని ఆలోచిస్తున్న అధిష్టానం చివరగా ధూళిపాళ్లను బరిలోకి దింపి ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకాలనుకుంటోంది.

నానిని సెట్, లేదంటే చర్యలు తీసుకోవాలని చర్చ
మొత్తానికి వీలైనంత వరకు నాని ఎపిసోడ్‌ను సెట్ చేయాలని, లేకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలనే తరహాలోనే చర్చ జరుగుతోంది. నానిని నేరుగా పార్టీ అధినాయకత్వమే పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. మరి నాని యాక్షన్‌కు అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి












Click it and Unblock the Notifications