కేశినేని నానికి కేంద్రం కీలక పోస్టు- టీడీపీ అసంతృప్త ఎంపీకి ఆఫర్- ఇక సొంత జిల్లాలో హవా ..!
ఏపీలో టీడీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ నేత కేశినేని నానిపై ముప్పేట దాడి కొనసాగుతున్న వేళ కేంద్రం ఆయన్ను కీలకమైన ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది.
విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్ధితుల్లో ఉన్న కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రస్తుతం ఇంటా బయటా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్రం కీలక పోస్టులో నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీతో పాటు ఇతర పార్టీలతోనూ పోరాడుతున్న కేశినేనిని ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది. జిల్లాలో కేంద్ర పథకాలకు ఆయన ఇకపై కీలకం కానున్నారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా, గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచినా తనకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని బాధపడుతున్న కేశినేని నాని ఓ దశలో చంద్రబాబుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. అంతే కాదు ఆయన చుట్టూ చేరిన కోటరీ వల్ల టీడీపీ నాశనం అవుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ తరఫున మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అధికార వైసీపీ కూడా ఆయన్ను అన్నింటికీ దూరం పెడుతోంది.

కేశినేనికి కేంద్రం కీలక పోస్టు
ఓవైపు సొంత పార్టీలో ఇమడలేక, అలాగని ఇతర పార్టీల్లోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కేశినేని నానికి కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ స్దాయిలో తాజాగా పలు నియామకాలు చేపట్టిన కేంద్రం కేశినేని నానికి కూడా సొంత జిల్లాలో కీలక పోస్టు మంజూరు చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో చేపట్టిన నియామకాల్లో భాగంగా కేశినేని నానికి కూడా సొంత జిల్లా ఎన్టీఆర్ లో నేతృత్వం వహించే అవకాశం దక్కింది. దీంతో కేశినేని నానికి దక్కిన పోస్టుపై ఇప్పుడు టీడీపీతో పాటు మిగతా పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ జిల్లా దిశ కమిటీ ఛైర్ పర్సన్ గా కేశినేని నాని
ఏపీలోని పలు జిల్లాలకు దిశా కమిటీల్ని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందులో పలువురు ఎంపీల్ని ఆయా కమిటీల ఛైర్ పర్సన్లుగా నియమించింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ ఛైర్ పర్సన్ గా ఎంపీ కేశినేని నానిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఎన్టీఆర్ జిల్లాలో కేంద్రం చేపట్టే కార్యక్రమాలకు ఆయన కీలకంగా మారబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీలో ఆయన ఛైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాల్లో కేశినేని కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సర్కార్ కు కేంద్రం లేఖ
కేంద్ర ప్రభుత్వం తరఫున దిశా పథకం అసిస్టెంట్ కమిషనర్ ఆయుష్ పూనియా ఏపీ పంచాయతీరాజ్ శాఖకు తాజాగా ఓ లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలోని జిల్లా దిశా కమిటీలు సరిగా పనిచేయడం లేదని, ఆయా కమిటీలకు స్ధానిక ఎంపీల్ని ఛైర్ పర్సన్ లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ చేసే ఈ కమిటీలకు ఆయా ఎంపీలు ఛైర్ పర్సన్లుగా పనిచేస్తారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయా ఛైర్ పర్సన్లు దిశా కమిటీల్లో నాన్-అఫీషియల్ సభ్యుల్ని నామినేట్ చేసే అధికారం కల్పిస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రతీ మూడునెలలకోసారి జిల్లా దిశా కమిటీ సమావేశాల్ని నిర్విహంచాలని, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెబ్ సైట్లో ఆ వివరాలు అప్ లోడ్ చేయాలని కూడా కోరారు. దిశా కమిటీల నియామకం పూర్తి కాకపోయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో తెలిపారు.












Click it and Unblock the Notifications