మునిగిన బెజవాడ, 50 ఏళ్ల రికార్డు - సాయం కోసం నిరీక్షణ..!!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ తడిసిముద్దయింది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 50 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో వర్షం కురవటంతో ఇదే రికార్డు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. క్రిష్ణా నదికి వరద భారీ ఎత్తున వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేసారు. ఇంకా పలు కాలనీలు వరదలోనే ఉన్నాయి.
అతలాకుతలం
రోజంతా ముంచెత్తిన వానతో బెజవాడ అతలాకుతలం అయింది. తాజా వర్షాలతో బెజవాడ, గుంటూరుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో కొండ రాళ్లు ఇళ్లపై పడి ఆరుగురు దుర్మరణం చెందారు. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలతో రవణా వ్యవస్థ పైన ప్రభావం పడింది. కాజ టోల్‌ప్లాజా వద్ద హైవే పైకి భారీగా వరద వచ్చింది. బెజవాడలో 50 ఏళ్ల రికార్డు వాన నమోదైంది.

రికార్డు స్థాయిలో
విజయవాడలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం గత ఐదు దశాబ్దాల కాలంలోనే అత్యధికంగా భావిస్తున్నారు. విజయవాడ నగరంలో 2020 అక్టోబరు 13న 122.06 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 174.2 మి.మీ. వర్షం పడింది. అలాగే శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 125.4 మి.మీ. నమోదైంది. ఈ రెండూ ఆల్‌టైమ్ రికార్డు వర్షపాతంగా చెబుతున్నారు.
#WATCH | Vijayawada, Andhra Pradesh: Following heavy rain in the region, Pulichintala project dam overflows pic.twitter.com/ePeFED760s
— ANI (@ANI) September 1, 2024
పొంగిన బుడమేరు
అలాగే విజయవాడ సెంట్రల్‌లో 172.4, 125.2., విజయవాడ నార్త్ మండలంలో 173.2, 125.8, విజయవాడ వెస్ట్‌లో 172.4, 125.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి 7గంటల వరకు అత్యధికంగా 258.92 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడలో జాతీయ రహదారులు, ప్రధాన, అంతర్గత రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల వరకు వర్షపు నీరు చేరింది. కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 20 ఏళ్ల తరువాత బుడమేరు పొంగింది. సమీప ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. సాయం కోసం స్థానికులు నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications