'భోగాపురం' ప్రారంభం వేళ 'విశాఖ' పై కేంద్రం అనూహ్య నిర్ణయం- 30 ఏళ్లు ఇక, నోటిఫికేషన్..!!
భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభం కోసం రానున్నారు. పూర్తి హంగులతో నిర్మించిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న వేళ కేంద్రం విశాఖ విమానాశ్రయం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో, దశాబ్దాల కాలంగా సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం లో ఇక విమానాల రాక పోకలు నిలిచిపోనున్నాయి.
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయం జాతికి అంకితం చేయనున్నారు. కాగా, కేంద్రం ఈ విమానాశ్రయం ప్రారంభం వేళ విశాఖ ఏయిర్ పోర్టు పైన కీలక ప్రకటన చేసారు. భోగాపురం కేంద్రంగా ఆగస్ట్ 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 30 సంవత్సరాల పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్ (ఐఎన్‌ఎస్ డేగ) సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది.

అత్యవసర సమయాల్లో మినహా
కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాబోయే 30 సంవత్సరాల పాటు విశాఖ ఏయిర్ పోర్టు నుంచి ఎటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు రాకపోకలు జరగవు. ఇదే సమయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులకు, విమానాలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ ను వినియోగించనున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇప్పటివరకు విశాఖపట్నం విమానాశ్రయానికి చెందిన ఐఏటీఏ కోడ్ VTZను ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి కొత్తగా ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా.. అత్యవసర సమయాల్లో విశాఖ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి మినహాయింపు ఉంటుంది. భారత వైమానిక దళం, రక్షణ దళాలు, పోలీసు విమానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ, లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు విశాఖ నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటి వరకు విశాఖ కేంద్రంగా సాగిన విమానాల రాక పోక లు ఇక నుంచి భోగాపురం కేంద్రంగా కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications