కూటమిలో వారి రూటే సపరేటు - ఝూన్సీకి కలిసొచ్చేనా...!!
ఏపీలో ఎన్నికల వేళ విశాఖ రాజకీయం కీలకంగా మారుతోంది. విశాఖలో గెలుపు ఇప్పుడు కూటమి, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా విశాఖ నుంచి మంత్రి బొత్సా సతీమణి బొత్సా ఝూన్సీకి జగన్ ఎంపీ సీటు కేటాయించారు. ఎన్డీఏ కూటమి నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. అయితే, బీజేపీ నుంచి ఈ సీటు కోసం ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సమీకరణాలు మారుతున్నాయి.
కూటమిలో ఇక్కట్లు
విశాఖలో ఈ సారి అనూహ్యంగా జగన్ వైసీపీ నుంచి బొత్సా ఝూన్సీని ఎంపిక చేసారు. ఎన్డీఏ కూటమిలో చివరి వరకు బీజేపీ ఈ సీటు ఆశించింది. కానీ, భరత్ కు టీడీపీ నుంచి సీటు ఖాయమైంది. ఇప్పటికీ జీవీఎల్ నరసింహారావు ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అయినా అంగీకరించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం కనిపించటం లేదు. విశాఖ లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారితో పాటుగా ఒడిశా, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. బీజేపీకి సీటు ఇస్తే కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసారు. కానీ, తిరిగి సీటు బాలక్రష్ణ చిన్న అల్లుడు గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌కి ఎంపీ టికెట్ ఇవ్వడంతో నేతలు సహకరించటం లేదనే వాదన ఉంది.

మారుతున్న సమీకరణాల
విశాఖ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం పోటీ పడ్డారు. కానీ, చంద్రబాబు జోక్యంతో పురందేశ్వరికి రాజమండ్రి సీటు కేటాయించారు. ఇక..మూడో పార్టీగా ఉన్న జనసేనకు పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇదే టీడీపీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. విశాఖ దక్షిణంలో జనసేన జగడం మొదలైంది. జనసేన అభ్యర్థి వంశీక్రష్ణ శ్రీనివాస్ కి సీటు కేటాయించారు. దీంతో అక్కడ తెలుగుదేశం నేతల వివాదాలు చెలరేగాయి. మాజీ మంత్రి బండారు, యలమంచిలి ఇంఛార్జి నాగేశ్వరరావు వీళ్లందరూ తీవ్ర అసంత్రప్తిలో ఉన్నారు. పెందుర్తి, యలమంచిలి సీట్లు జనసేనకు వెళ్లిపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కలిసొచ్చేదెవరికి
మరోవైపు విశాఖలో పట్టున్న కీలక నేత, మాజీ మంత్రి వరుస విజయాలు సాధించిన గంటా శ్రీనివాసరావుకు చివరి నిమిషంలో భీమిలి సీటు కేటాయించారు. అక్కడ అవంతి ప్రచారంలో ముందున్నారు. పొత్తు కారణంగా సీనియర్లకు ప్రాధాన్యత దక్కకపోవటంతో టీడీపీ నేతలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు .
బొత్సా ఝూన్సీ లక్ష్మీకి గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది. పార్లమెంటులో ఉత్తరాంధ్ర సమస్యలను ప్రస్తావించిన గుర్తింపు దక్కించుకున్నారు. పొరుగు జిల్లాలో ఎంపీగా ఉన్న సమయంలోనే విశాఖపట్నం పోర్టు కోసం, కేంద్ర ఉద్యోగుల కోసం, రైల్వే జోన్ కోసం, స్టీలు ప్లాంటు కోసం పార్లమెంట్ లో గళం విప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. వీటితో పాటుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ, కేఏ పాల్ ఇక్కడే పోటీకి సిద్దం అవుతున్నారు. మంత్రి బొత్సాకు విశాఖలో మంచి పట్టుంది. దీంతో, ఇక్కడ ఎన్నికల రాజకీయంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications