విశాఖలో చంద్రబాబుకు వైసీపీ స్వాగతం.. కండిషన్ పెట్టిన వంశీకృష్ణ.. మంత్రి అవంతి స్థానికతపై రగడ
''తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా''అంటూ ఉద్యమ సంయంలో కేసీఆర్ చెప్పిన మాటలు తెలుగు ప్రజలకు బాగా గుర్తే. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా దాదాపు కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుంది. విశాఖపట్నంలో చంద్రబాబుపై దాడి, అరెస్టు వివాదాస్పదమైన నేపథ్యంలో విశాఖ సిటీ వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

వైసీపీ నేత ఏమన్నారంటే..
పర్యటనను అడ్డుకున్న కోపంతో ఉత్తరాంధ్ర ప్రజలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వంశీకృష్ణ హెచ్చరించారు. అయితే రాజధాని ఏర్పాటుకు సహకరిస్తే మాత్రం సీన్ మరోలా ఉంటుందన్నారు. ‘‘ఉత్తరాంధ్ర ప్రజలు.. ప్రత్యేకించి వైజాగ్ నగర వాసులు బేసిగ్గా శాంతికాముకులు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకుకు చంద్రబాబుతోపాటు ఎవరు మద్దతి ఇచ్చినా పూలతో స్వాగతం పలుకుతారు. అదుకు అడ్డుపడితే మాత్రం ఎవరినైనాసరే కాలు కూడా పెట్టనివ్వరు'' అని వంశీకృష్ణ చెప్పుకొచ్చారు.

ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిపోండి..
‘‘చంద్రబాబు నాన్ లోకల్ కాబట్టి ఉత్తరాంధ్ర గురించి ఏదైనా మాట్లాడుతాడు. కానీ ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ కూడా బాబుకు వత్తాసు పలకడంలో అర్థంలేదు. గణేశ్ తోపాటు ఇంకా ఎవరైనా ఉండటం ఇష్టంలేకపోతే ఉత్తరాంధ్ర నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.. అంతేగానీ ఇక్కడే ఉంటూ అభివృద్ధికి అడ్డుతగులుతామంటే చూస్తూ ఊరుకోబోము''అని వంశీకృష్ణ హెచ్చరించారు.

మంత్రి అవంతి లోకల్ కాదా?
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి శ్రీనివాస్) జిల్లాలో తన కార్యకలాపాలను వేగవంతం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తరచూ అవంతి స్థానికతపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై వైజాగ్ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ ఘాటుగా స్పందించారు. మంత్రి అవంతికి విశాఖతో సంబంధంలేదని ఇంకోసారి అంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రకటన తర్వాత స్థానిక నేతల్లో తీవ్రబేధాభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications