ఏపీ రూపురేఖలు మార్చే తరుణం.. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సంబరాలు
విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ (CII) అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సదస్సు ప్రాంగణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు అధికారులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల రాకతో విశాఖ నగరం పారిశ్రామిక కళను సంతరించుకుంది.
సాంస్కృతిక నిరాజనాలు.. కళాకారులతో నేతల ముచ్చట్లు
సదస్సు ప్రారంభంలో భాగంగా ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. డోలు వాయిస్తున్న కళాకారులను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వివిధ కళా బృందాల వద్దకు స్వయంగా వెళ్లిన నేతలు వారిని అభినందిస్తూ ఫొటోలు దిగారు. అలాగే ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రత్యేకంగా గుర్తించి, వారితో ఫొటోలు దిగి అభినందించడం విశేషం.

ఏపీ, ఎంఎస్ఎంఈ పెవిలియన్ల ప్రారంభం
అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ (MSME) పెవిలియన్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయనే విషయాలను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ కేంద్ర మంత్రికి మంత్రి నారా లోకేష్ వివరించారు.
అభివృద్ధి ప్రస్థానంపై 'స్వర్ణాంధ్ర' ప్రజెంటేషన్
వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి, గ్రోత్ స్టోరీలను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్స్ మీద అధికారులు ప్రదర్శించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఎకనమిక్ రీజియన్లలో జరుగుతున్న అభివృద్ధి, సీఆర్డీఏ పరిధిలోని కీలక ప్రాజెక్టులపై అధికారులు సవివరమైన డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అరకు కాఫీ రుచులు.. కళాకృతుల పరిశీలన
సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను నేతలు ఆసక్తిగా పరిశీలించారు. అరకు కాఫీ స్టాల్ వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పీవీఎన్ మాధవ్‌లతో కలిసి అరకు కాఫీని రుచి చూశారు. గిరిజనులు రూపొందించిన ప్రత్యేక వర్లీ, ఇతర చిత్రాలను తిలకించి నేతలు ఆకట్టుకున్నారు. తోలుబొమ్మలాట, పెన్ కలంకారీ సహా ఏపీకి చెందిన ప్రముఖ కళలు, కళాకారుల ప్రావీణ్యాన్ని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. అనంతరం నేతలందరూ సదస్సు ప్రాంగణంలో బ్యాటరీ కారులో ప్రయాణిస్తూ వివిధ విభాగాలు, ప్రాంగణాలను పరిశీలించారు.














Click it and Unblock the Notifications
