ప్లేటు తిప్పేసిన శారదా పీఠం స్వరూపానంద!
విశాఖపట్నం శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద కూడా ప్లేటు తిప్పేశారు. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆయన కూడా మారిపోయినట్లున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ముద్దులు పెట్టుకొని మరీ స్వరూపానంద ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ గెలవాలంటూ యాగాలు చేశారు.
చంద్రబాబువల్లే అభివృద్ధి
ఇప్పుడు మాత్రం చంద్రబాబునాయుడువల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రకటించారు. గత ప్రభుత్వం నుంచి విశాఖ శారదాపీఠం పెద్ద ఎత్తున భూములను పొందింది. వాటిని కాపాడుకోవడానికే స్వరూపానంద ప్లేటు ఫిరాయించారంటున్నారు. చంద్రబాబునాయుడు శ్రీ మహాలగ్నంలో 11.25 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఇది ఎంతో మంచి లగ్నమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

అమరావతిలో పీఠాన్ని అభివృద్ధి చేస్తాం
ఏపీ నూతన రాజధాని అమరావతిలో శారదా పీఠానికి స్థలం ఉందని, అక్కడ దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తాను ఆశిస్తున్నానని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హయాంలో దేవాదాయశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకం కాదని, తన వ్యక్తిత్వం పెద్దలకు తెలుసని, ఒకరికి భయపడి ఈ సమావేశాన్ని తాను ఏర్పాటు చేయలేదని స్వరూపానంద వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గతంలో తాను మురళీమోహన్ గెలవాలంటూ రాజమండ్రిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
శారదా పీఠం ప్రభుత్వాలపై ఆధారపడదు
రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబే అన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. శారదా పీఠం ప్రభుత్వాల పై బతకదని, ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. తమపై తప్పుడు అభిప్రాయాలు రాకుండా ఉండేందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో స్వరూపానంద అంటకాగుతారని, వైసీపీకి, జగన్ కు తానే రాజగురువు అన్నట్లుగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనపై మండిపడుతున్నాయి. భూములు లాక్కోకుండా ఉండేందుకే ఈ కొత్త నాటకమంటున్నారు.












Click it and Unblock the Notifications