తుఫానుకు విశాఖ ధ్వంసం: పునర్నిర్మించాల్సిందే

విశాఖఫట్నం: హుధుద్ తుఫాను తాకిడికి విశాఖపట్నం పరిస్థితి దారుణంగా తయారైంది. నగరాన్ని పూర్తిగా పునర్మించాల్సిందేనని నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్‌డిఆర్ఎఫ్) సీనియర్ అధికారులు అంటున్నారు. ఆదివారంనాడు ఉక్కు నగరాన్ని తుఫాను తీవ్రంగా తాకింది. ఆ తర్వాత గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విచాయి. భారీ వర్షం కురిసింది. దీంతో విశాఖ నగరం తుక్కుతుక్కు అయింది.
విశాఖనగరం 70 నుంచి 80 శాతం వరకు ధ్వంసమైందని అంచనా వేసినట్లు ఎన్‌డిఆర్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ గులేరియా అన్నారు. చాలా మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. దాంతో పునరావాస శిబిరాలు నడవాల్సే ఉంటుంది.
వైజాగ్‌లో విద్యుత్తు సరఫరా లేదు. టెలిఫోన్ లైన్స్ కూడా తెగిపోయాయి. కలెక్టర్ కార్యాలయానికి కూడా టెలిఫోన్ సౌకర్యం లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా శనివారం సాయంత్రం నుంచే విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఆ తర్వాత తుఫాన్ విద్యుత్తు వ్యవస్థను తన్నేసింది. విశాఖపట్నం, శ్రీకాకుళంల్లో వదంలాది విద్యుత్తు స్తంభాలు, టవర్లు నేలకూలాయి.

విశాఖ విమానాశ్రయం మూతపడింది. విమానాశ్రయం పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. విమానాశ్రయంలో నీరు నిలిచింది. విమానాలను నడిపించడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం నుంచి వర్షం తెరిపి ఇచ్చింది. విజయవాడ జాతీయ రహదారిపై రోడ్లకు అడ్డంగా కూలిన చెట్లను, హోర్డింగులను సోమవారం సాయంత్రానికి తొలగించారు.
సోమవారం ఉదయం లేచేసరికి ప్రజలకు కూలిన చెట్లు, విరిగిన విగ్రహాలు, కూలిన విద్యుత్తు, టెలిఫోన్ స్తంభాలు కనిపించాయి. నిత్యావసర సరుకుల కోసం కూడా విశాఖలో రోడ్లపై నడవలేని స్థితి ఏర్పడింది. నష్టం పూర్తి అంచనా ఇంకా వేయాల్సే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాడార్స్ పనిచేయడం లేదు.












Click it and Unblock the Notifications