వాలంటీర్లు మొదలెట్టేసారు - కీలక మలుపు..!!
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుతం ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడు నెలలుగా వేచి చూస్తున్న వాలంటీర్లు ఇప్పుడు తమ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం ఏపీలో కొత్త టర్న్ తీసుకుంది.
వాలంటీర్లు నిరసన ప్రారంభించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా 2. 60 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లోపు తమకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని ఈనెల 26 నుంచి అక్టోబర్ రెండు వరకు శాంతియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసనకు దిగారు. విశాఖలో తమను విధుల్లో కొనసాగించాలంటూ వాలంటీర్లు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడగకుండానే పదివేల జీతం ఇస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సేవ చేయటం కోసం తామంతా నామమాత్రపు వేతనాలతో విధుల్లోకి వచ్చామని వాలంటీర్లు గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశం పైన చర్చ జరుగుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ వాలంటీర్లు, సచివాలయాలను ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీర్లు తమకు వేతనాలు కూడా అందడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు వీరు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications