ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేదు.. అదే శ్రీరామరక్ష: చంద్రబాబు
Recommended Video

అమరావతి: కేంద్రంతో పోరాటం విషయంలో మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తమకు పనిలేదని, ప్రజాప్రతినిధుల పోరాటం, అధికార యంత్రాంగాల సామర్థ్యమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. ఇకముందు కూడా ప్రజాప్రతినిధులంతా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు..

నీరు-ప్రగతి టెలీకాన్ఫరెన్స్ :
నీరు-ప్రగతి పథకంలో వ్యవసాయ సమస్యలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విభజన చట్టం, అందులోని హామిల గురించి ఆయన ప్రస్తావించారు.
విభజన చట్టంలోని హామీలు అమలు కానందు వల్లనే ఏపీకి న్యాయం చేయమని ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ స్ఫూర్తి అలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఉపాధి కూలీపై:
అధికారులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు చంద్రబాబు తెలిపారు.గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.
అలాగే ఉపాధి కూలీలకు సైతం సకాలంలో చెల్లింపులు జరపాలని చెప్పారు. ఉపాధి కూలీల రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచాలని, వాళ్లకు అందాల్సిన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని అన్నారు.

100శాతం చేరుకోవాలి..:
గతంతో పోలిస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాలుగైదు రెట్లు అధికంగా కౌలు రైతులకు రుణాలు ఇప్పించామని చంద్రబబు అన్నారు. కౌలు రైతులు సంతృప్తితో ఉన్నారని, వారి స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని తెలిపారు. పంట రుణాల లక్ష్యం 100శాతం చేరుకోవాలని సీఎం సూచించారు.

కోటి ఎకరాల లక్ష్యం..:
రాష్ట్రంలో పండ్ల తోటల సాగు మరింత పెరగాలని, పశుగణాభివృద్ధిలో 20% అధిక రాబడి సాధించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు.
దాదాపు కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం జరగాలని, జల సంరక్షణ ఉద్యమం రెండోదశ పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. చెరువుల పూడికతీత, ముళ్ల కంపల నరికివేత పనులు యుద్దప్రాతిపదికన జరగాలన్నారు. శుగ్రాసం, సైలేస్, గ్రీన్ పౌడర్, డీఎంఆర్ వంటివి రైతులకు సరఫరా చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications