ఆహారపదార్థాలు పంపాం: పరకాల, తమిళ సాయం
హైదరాబాద్: హుధుద్ పెను తుఫాను సహాయ చర్యల కోసం ఉన్నతాధికారులతో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు వంద టన్నుల ఆహార పదార్థాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.
విజయవాడ నుంచి 50 టన్నులు, రాజమండ్రి నుంచి 50 ట్నుల ఆహారాన్ని విశాఖపట్నం తరలించినట్లు తెలిపారు. విశాఖలో బిఎస్ఎన్ఎల్ లైన్లు 90శాతం పనిచేస్తున్నాయని తెలిపారు. 5లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించామని, బాధితులకు 25కిలోల బియ్యం, కిలో చక్కెర, 5లీటర్ల కిరోసిన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
పలు రైళ్ల సర్వీసులు రద్దు
తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే సోమవారం కూడా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. తిరుపతి-పురి, ముంబై-భువనేశ్వర్, నిజాముద్దీన్-విశాఖ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.

జలదిగ్బంధంలో శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాలు హుధుద్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షానికి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొప్పర, గీతనపల్లి, దేవకివాడ, కొండచాకరపల్లి, బూర్జ, కాగండ్యం, నారాయణపురం, చినలంకెం, లాభం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోపక్క నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
రాత్రి వరకు విద్యుత్ సరఫరా: అజయ్ జైన్
తుఫాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 13 కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రి పంపనున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 2వేల మంది సిబ్బందిని పంపామని చెప్పారు. సోమవారం అర్ధరాత్రి లోపు విశాఖలోని కొన్ని ప్రాంతాలకైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని జైన్ తెలిపారు.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 400 కెవి ట్రాన్స్ ఫార్మర్లు రెండు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. 220 కెవి ట్రాన్స్‌ఫార్మార్లు 10 దెబ్బతిన్నాయి. 132 కెవి ట్రాన్స్ ఫార్మర్లు 25 పూర్తి దెబ్బతిన్నాయి.
రూ. 5 కోట్లు సాయం చేసిన తమిళనాడు
తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది.












Click it and Unblock the Notifications