AP weather:ఏపీకి రెయిన్ అలర్ట్: మూడు రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు
ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణం చల్లబడుతోంది.
అమరావతి: ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణం చల్లబడుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు పశ్చిమబెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.

ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు
ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు తీర ప్రాంతం.. అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ క్రమంలోనే ఏపీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వేగంగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈదురుగాలులతో వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉరుములుమెరుపులతో వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో గురువారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు, రాయలసీమలోనూ గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications