ఏపీలో ఎండలకు తోడు వడగాల్పులు- ఈ జిల్లాల్లో భీతావహం
Summer season: ఏపీలో ఎండల తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. ఇదే తరహా వాతావరణం మరి కొన్నిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తోన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేస్తోన్నారు.

పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడు కానున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. అనేక మండలాలు వడగాల్పుల బారిన పడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నానికి ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది.
మార్చి నెల మొత్తం కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుంది. చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఎండలో బయటకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.












Click it and Unblock the Notifications