అల్పపీడన ద్రోణి: ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరికలు
అమరావతి: పశ్చిమమధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణం కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్సాలు, తీరం వెంబడి వేగంగా గాలులు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబటి గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది.

జాలర్లు సముద్రంపైకి వెళ్లొద్దు..
మత్స్యకారులు నేటి నుంచి ఎల్లుండి వరకు సముద్రంపై వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కే కన్నబాబు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఏపీలో విస్తారంగా వర్షాలు.. రైతుల్లో ఆనందం
కాగా, అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గన్నవరం పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గొల్లపల్లి వద్ద గన్నవరం-ఆగెరెపల్లి ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆముదాలవలస తోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు, పంటపొలాలు జలమయమయ్యాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పంటలు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ తోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు
మరోవైపు, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో తెలంగాణపైనా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణం కేంద్రం తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications