చంద్రబాబు ఇక్కడే పుట్టి ఓడిపోయారు, వైయస్ వల్లే మంత్రి పదవి: జగన్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఆయన పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. పత్తిపుత్తూరు, పుడిక్రాస్, అప్పలాయగుంట, ఎనుములపాలెం, తిరుమన్యం, రాజులకండ్రిక, వేమపురం, గొల్లకండ్రిగ మీదుగా సాగింది.
జగన్ వడమలపేట మీదుగా పాడిరేడుకు చేరుకొని అక్కడే బస చేస్తారు. జగన్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ సోమవారం సంక్రాంతి పండుగను చంద్రగిరిలో జరుపుకున్నారు.

ప్రజలు, కార్యకర్తల మధ్య సంక్రాంతి సంబరం
వైయస్ జగన్ సంక్రాంతి సంబరాలను చంద్రగిరి మండలం పారకాల్వ గ్రామంలో ప్రజలు, కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. ఆదివారం పాదయాత్ర ముగించిన అనంతరం పారకాల్వ గ్రామంలోనే బస చేసిన జగన్ సోమవారం అక్కడే తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి పూజలు నిర్వహించారు.
గ్రామంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కొత్త వస్త్రాలు సమర్పించి నివాళులు అర్పించారు.

గాలిపటాలు ఎగరేసిన రోజా, విజయసాయి రెడ్డి
ఆ తర్వాత గ్రామస్థులతో కలిసి జగన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రాలను ధరించిన జగన్ గ్రామస్థులను ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకరించారు. నగరి ఎమ్మెల్యే రోజా, ఎంపీ విజయసాయి రెడ్డి గాలిపటాలను ఎగరేసి గ్రామస్థులను ఉత్సాహపరిచారు.

చంద్రబాబు ఇక్కడే జన్మించారని జగన్
అంతకుముందు రోజు, జగన్ తన పాదయాత్రలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం టిడిపికి బలమైన స్థానమని, దీని కోసం చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. చంద్రగిరి టీడీపీకి ప్రత్యేకమైన నియోజకవర్గం అని ఆయన చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే జన్మించారని చెప్పారు.

వైయస్ వల్ల మంత్రి అయిన చంద్రబాబు
1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారని, తన రాజకీయ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ప్రారంభించారని జగన్ గుర్తు చేశారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సహకారంతో చంద్రబాబు మంత్రి అయ్యారని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు రెండోసారి ఓడిపోయారు
ఆ తర్వాత 1983లో చంద్రగిరి నుంచి రెండోసారి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి చంద్రబాబు ఓడిపోయారని జగన్ గుర్తు చేశారు. మంత్రిగా పని చేసి కూడా చంద్రబాబు 17వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారని విమర్శించారు.












Click it and Unblock the Notifications