రామోజీరావు తర్వాత 'ఈనాడు' వారసులు వీరే
అక్షర యోధుడు రామోజీరావు అస్తమించారు. ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాల్లో 'ఈనాడు' ఒకటి. ఈ సంస్థ అంటే రామోజీరావుకు ఎంతో ప్రాణం. ఎక్కడో విశాఖపట్నంలో ప్రారంభమైన 'ఈనాడు' అనితర సాధ్యమైన సంస్థగా ఎదగడమేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను శాసిస్తోంది. అంతటి సంస్థగా తీర్చిదిద్దడం వెనక రామోజీరావు కఠోర శ్రమ దాగివుంది. ఈ మార్గంలో ఆయనకు తోడుగా నిలిచినవారు ఎందరో ఉన్నారు. వారిలో ఆయన స్నేహితుడు రామ్మోహన్ రావు ప్రధానం. టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి 'ఈనాడు' అప్పగించారు.
రామ్మోహన్‌రావు కృషే ప్రధానం
ఈరోజు 'ఈనాడు' ఈ స్థాయిలో ఉందంటే రామ్మోహన్ రావు కృషే ప్రధానమని రామోజీరావు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన మరణం రామోజీరావును బాగా కుంగదీసింది. మరణించే సమయానికి రామ్మోహన్ రావు ఫిలింసిటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామోజీరావు వ్యాపారా సామ్రాజ్యంలో ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ 'ఈనాడు' మహావృక్షం లాంటిది. ఈ సంస్థకు ప్రస్తుతం వారసలు ఎవరంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే రామోజీరావు తాను జీవించి ఉన్న సమయంలోనే సంస్థలను అందరికీ అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయా సంస్థలను వారే నడుపుతున్నారు.

సంస్థల వికేంద్రీకరణ
అన్నదాత, విపుల, చతుర, బాలభారం, తెలుగు వెలుగు లాంటివన్నీ మూసేశారు. పెద్ద కుమారుడు కిరణ్ కు 'ఈనాడు' బాధ్యతలను అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి సంస్థను ఆయనే నడిపిస్తున్నారు. ఎడిటోరియల్ విషయంలో మాత్రం రామోజీరావు జోక్యం చేసుకునేవారు. పెద్ద కోడలు శైలజాకిరణ్ కు మార్గదర్శి చిట్ ఫండ్, కళాంజలి, చిన కోడలు విజయేశ్వరికి రామోజీ ఫిలింసిటీ, మనవరాలు బృహతికి ఈటీవీ భారత్, ఇతర సంస్థల బాధ్యతలను చినకొడుకు సుమన్ కుమారుడు, కిరణ్ కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్న కుమారుడు సుమన్ అనారోగ్యంతో కొన్నాళ్ల క్రితం మృతిచెందిన విషయం తెలిసిందే. రామోజీరావు మాత్రం తన చివరి శ్వాస వరకు 'ఈనాడు' కోసమే పనిచేశారు. పత్రిక ప్రతిరోజు చదువుతూ ఎడిటోరియల్ సిబ్బందికి సూచనలిచ్చేవారు. వారసుల చేతిలో రామోజీ గ్రూపు సంస్థలు మరింతగా వృద్ధి చెందాలని అందరూ కోరుకుంటున్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీరావు పేరు మాత్రం ఆ చంద్ర తారార్కం వెలుగులీనుతూనే ఉంటుంది.












Click it and Unblock the Notifications