కిరణ్ వైపు ఎవరు, పార్టీలో ఎందరు: తేల్చేందుకే బొత్స!
హైదరాబాద్: ఈ రోజు సాయంత్రంతో కాంగ్రెసు పార్టీలో ఉండేదెవరో, వెళ్లిపోయేదెవరో తేలనుందా? అంటే పలువురు కాంగ్రెసు నేతలు అవుననే అంటున్నారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం పట్ల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు కొండ్రు మురళి, డొక్కా మాణిక్య వర ప్రసాద్, బాలరాజు తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సీమాంధ్ర నేతలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలనుకునే వారు సాయంత్రం బొత్స ఆధ్వర్యంలో జరిగే భేటీకి వస్తారని చెప్పారు. తద్వారా ఈ భేటీకి రాను మంత్రులు కిరణ్ వైపు వెళ్లినట్లుగా పరోక్షంగా రఘువీరా రెడ్డి చెప్పినట్లు భావించవచ్చు. సమైక్య రాష్ట్రం కోసం తాము చివరి ప్రయత్నంగా ఏం చేయాలో అది చేస్తామని రఘువీరా అన్నారు.

కాంగ్రెసు పార్టీలో ఉండేవారెవరో, వీడే వారెవరో సాయంత్రం తేలుతుందని మరో మంత్రి కూడా వ్యాఖ్యానించారు. నిన్నటి కిరణ్ భేటీకి ఒక అజెండా లేదని బాలరాజు ధ్వజమెత్తారు. పార్టీని వ్యతిరేకిస్తే ఊరుకోమన్నారు. నచ్చని వారు పార్టీ నుండి వెళ్లి పోవచ్చునని, వెన్నుపోటు రాజకీయాలకు తగిన సమాధానం చెబుతామన్నారు.
సాయంత్రం భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరో మంత్రి కొండ్రు మురళీ ముఖ్యమంత్రి పైన నిప్పులు చెరిగారు. ఆదివారం కిరణ్ భేటీకి హాజరైన పలువురు ఈ రోజు బొత్స భేటీకి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు. వారు తిరిగి కాంగ్రెసు వైపుకు మరలినట్లుగా భావించవచ్చు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా కడప జిల్లాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నారు.
కాంగ్రెసు వైపు ఎవరుంటారో తెలుసుకునేందుకే..!
కాంగ్రెసు పార్టీ వైపు ఎవరు ఉంటారో, కిరణ్ వైపు ఎవరు వెళ్తారో తెలుసుకునేందుకే బొత్స సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసినట్లుగా కాంగ్రెసు నేతల వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఈ సమావేశానికి కేవలం మంత్రులకు మాత్రమే ఆహ్వానం పలికామని బొత్స చెప్పారు. ఈ భేటీలో కిరణ్ కదలికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. కిరణ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఏం చేస్తారు, ఆయన వైపు ఎమ్మెల్యేలు ఎవరెవరు వెళ్తారో చర్చించనున్నారని తెలుస్తోంది.
కిరణ్ రాజీనామా ఎప్పుడు?
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన రేపు చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పారు. కిరణ్ కూడా చర్చ జరిగే రోజు రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం కిరణ్ రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదు. తదనంత పరిణామాల పైన కూడా బొత్స అండ్ కో భేటీలో సాయంత్రం చర్చించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications