కన్నా కంచుకోటలో పాగా వేసేదెవరు?
Pedakurapadu Assembly round up 2024: నరసరావుపేట లోక్‌సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పెదకూరపాడు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కంచుకోట. 20 సంవత్సరాల పాటు ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1989 నుంచి 2004 వరుసగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2009లో టీడీపీ వశమైంది. ఇప్పుడక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది.
బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,22,675 మంది ఓటర్లు ఉన్నారీ నియోజకవర్గంలో. సంఖ్యాపరంగా కమ్మ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికం. ఆ తరువాత ఎస్సీ, కాపు, ముస్లిం, రెడ్లు నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారు.

1955 నుంచి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగ్గా.. అయిదుసార్లు కాపులు, నాలుగుసార్లు కమ్మ వాళ్లు, నాలుగుసార్లు రెడ్లు, ఒకసారి ముస్లిం అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించాక మొత్తంగా తొమ్మిదిసార్లు ఈ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అయిదు సార్లు కాపులు, మిగిలిన నాలుగుసార్లు కమ్మ వాళ్లు గెలిచారు.
అత్యధికంగా నాలుగుసార్లు కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నాలుగుసార్లు చొప్పున, వైసీపీ ఒక్కసారి ఇక్కడ పాగా వేశాయి. 2009లో టీడీపీకి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్ధి నూర్జహాన్ పఠాన్ మీద 9,878 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1989 తరువాత తొలిసారిగా ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కోల్పోయింది.
2014లో కొమ్మాలపాటి మరోసారి గెలిచారు పెదకూరపాడు నుంచి. వైసీపీ అభ్యర్ధి బొల్లా బ్రహ్మనాయుడుపై 9,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ జెండా పాతింది. ఆ పార్టీ అభ్యర్ధి నంబూరు శంకరరావు.. కొమ్మాలపాటి శ్రీధర్‌పై 14,108 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సారి వ్యూహం మార్చింది టీడీపీ. కొమ్మాలపాటి శ్రీధర్‌కు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి భాష్యం ప్రవీణ్‌ను బరిలోకి దించింది. వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చలేదు. నంబూరు శంకరరావుకే టికెట్ ఇచ్చింది. ఇక ఈ నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications