గుడ్డు ధర వెనుక అసలు గుట్టు: ఒక్కసారి ఎందుకింతలా పెరిగిందో తెలుసా?..
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కోడిగుడ్ల వినియోగం ఎక్కువ. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం కావడంతో..
విజయవాడ: గుడ్డు ధర వింటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మునుపెన్నడూ లేని రీతిలో ఒక్కసారే గుడ్డు ధర రూ.7కి చేరడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. దీని వెనక కారణాలేంటా? అని ఆరా తీస్తున్నారు. అంతేకాదు, మున్ముందు గుడ్డు ధర మరింత కొండెక్కే అవకాశం ఉండటంతో మధ్య తరగతిలో కలవరం మొదలైంది.
Recommended Video


ఎగుమతులే కారణం:
గుడ్డు ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకోవడానికి ప్రధాన కారణం ఎగుమతులు పెరగడమే అంటున్నారు. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లలో 80 శాతానికి పైగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
అందులో ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమబెంగాల్, అసోం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రాల్లో కోడి గుడ్ల వాడకం మరింత పెరగడంతో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి.

అక్కడ రూ. 7 పైనే:
ఢిల్లీ రిటైల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.7 పైమాటే. ధర ఎక్కువగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులంతా కోడిగుడ్లను ఎక్కువగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో మార్కెట్లో సామాన్యులకు కోడిగుడ్లు అందుబాటులో లేకుండా పోయాయి. అదే సమయంలో ఉత్తరాది వ్యాపారులకు విక్రయించిన రేటుకే.. స్థానిక వ్యాపారులకు విక్రయిస్తుండటంతో రేటు పెరిగినట్టు చెబుతున్నారు.

పడిపోయిన అమ్మకాలు:
ప్రస్తుతం పౌల్ట్రీ యజమానులు ఒక్కో గుడ్డును రూ.4.50కి విక్రయిస్తున్నారు. ఇదే రేటు హోల్ సేల్ మార్కెట్‌లో అయితే రూ.6, రిటైల్ మార్కెట్ లో అయితే రూ.7వరకు పలుకుతోంది. రేటు పెరగడం అమ్మకాలకు కూడా ప్రతికూలంగా మారింది. ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారీ ధర పెట్టి గుడ్లు తీసుకొచ్చినా.. వాటిని జనం కొనే స్థితిలో లేకపోవడంతో వ్యాపారులు ఢీలా పడుతున్నారు.

పేద, మధ్యతరగతికి కష్టమే:
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కోడిగుడ్ల వినియోగం ఎక్కువ. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం కావడంతో.. వారానికి ఒకరోజైనా ఇంట్లో కోడిగుడ్ల కూర వండాల్సిందే. కానీ తాజా పరిస్థితులు గుడ్డు ధరను కొండెక్కించడంతో.. మధ్య తరగతి కుటుంబాలు గుడ్డుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పేద వర్గాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications