వ్యూహం: మోడీకి కెసిఆర్ ఎందుకు దగ్గరవుతున్నారు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కచ్చితంగానే ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మతవాద పార్టీ అంటూ దూరంగా ఉంటూ వచ్చిన కెసిఆర్ ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహానంతర వేడుకలకు హాజరు కావడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఎన్నికలకు ముందే బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడుపడితే అప్పుడు తరుచుగా ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలుస్తూ వచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును నరేంద్ర మోడీ దూరం పెడుతూ వచ్చారు. కేంద్రం నుంచి నిధులు రావడం కూడా తెలంగాణకు ఇబ్బందిగా పరిణమించిన స్థితిలోకి కెసిఆర్‌ను నెట్టినట్లు భావిస్తున్నారు. కేంద్రంతో సయోధ్య నెరిపితే తప్ప తెలంగాణకు తగిన నిధులను తెచ్చుకునే అవకాశాలు ఉండవనే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కెసిఆర్ మోడీకి దగ్గరయ్యారని కచ్చితంగా చెప్పలేం గానీ మరో కారణం కూడా ఉండి ఉంటుంది.
కెసిఆర్ ప్రభుత్వం ఆరు నెలల పాటు ఏమీ అనలేని ఇరకాటంలో చిక్కుకున్న ప్రతిపక్షాలు ఆ తర్వాత గొంతు విప్పాయి. ఆందోళనలకు కూడా దిగుతున్నాయి. ఛాతీ ఆస్పత్రి తరలింపు వంటి అంశాలపై కెసిఆర్ ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని కాంగ్రెసు పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. వివిధ అంశాలపై కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది.

అదే సమయంలో వామపక్షాలు తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు అవసరమైన పునాదిని తయారు చేసుకుంటున్నాయి. సిపిఎం, సిపిఐ ఇతర వామపక్షాలను కలుపుకుని ఐక్య సంఘటనకు పూనుకున్నాయి. పది వామపక్షాలు కూడా ఒక్కటై కెసిఆర్ ప్రభుత్వంపై ఆందోళనకు శ్రీకారం చుట్టడానికి సిద్ధపడుతున్నాయి. వాస్తు పేరుతో కెసిఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా మేధావి వర్గాన్ని చిక్కుల్లో పడేస్తున్నాయి. ఇప్పటి వరకు కెసిఆర్‌కు మొక్కవోని మద్దతు ఇచ్చిన మేధావి వర్గంలో కాస్తా సడలింపులు ప్రారంభమయ్యాయి.
ప్రతిపక్షాలు ఒక్కటైతే వచ్చే ఐదేళ్ల కాలంలో తనకు అనేక చిక్కులు ఏర్పడవచ్చుననే ఉద్దేశంతో ముందుగానే కెసిఆర్ జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు బిజెపికి దగ్గరయితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపినే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉండదు. దాంతో ప్రతిపక్షాల్లో చీలిక వస్తుంది. కాంగ్రెసును ఇప్పటికీ ప్రజలు నమ్మడం లేదనే అభిప్రాయం ఉంది. పైగా, అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా ఓ బలమైన వర్గం అంతర్గత పోరు సాగిస్తూనే ఉంది. కొంత మంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేస్తున్నారు.
అయితే, అవకాశం దొరికితే మాత్రం కాంగ్రెసులోని గ్రూపులన్నీ ఏకమై తనకు వ్యతిరేకంగా పోరాటానికి దిగవచ్చుననే అంచనా కెసిఆర్‌కు ఉండవచ్చు. దానికితోడు, వామపక్షాలు వాటంతటవి బలమైన శక్తి కాలేకపోయినప్పటికీ కాంగ్రెసుతో కలిస్తే పరిస్తితిలో మార్పు రావచ్చు. అలా కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో కాంగ్రెసును, వామపక్షాలను ఎదుర్కోవడానికి బిజెపి, టిడిపిలను తనపై పోరాటానికి దూరంగా ఉంచితే సరిపోతుందనే అభిప్రాయం కూడా కెసిఆర్‌కు ఉండవచ్చు.
నిజానికి, టిఆర్ఎస్‌లో అటు అతివాదులు, ఇటు మితవాదులు ఉన్నారు. ఓ వర్గం బిజెపితో స్నేహాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో, వచ్చే ఎన్నికలనాటికి కూడా ఆ వర్గం గొంతెత్తే అవకాశం లేదు. దానివల్ల అంతర్గత కెసిఆర్‌కు బిజెపికి దగ్గరైనా నష్టం జరగదు. కానీ, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో అది బెడిసి కొట్టవచ్చు. మైనారిటీలకు చేరువ కావడానికి, హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పాగా వేయడానికి కెసిఆర్ మజ్లీస్‌తో దోస్తీ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. బిజెపికి కెసిఆర్ దగ్గరయితే మజ్లీస్ దూరం జరిగే అవకాశం ఉంది. ఈ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా టిడిపి, బిజెపి కలిసి పనిచేయడం అనివార్యంగానే మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీలకు సహకరిస్తారు.
కాంగ్రెసు గానీ వామపక్షాలు గానీ కెసిఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు లేవు. మజ్లీస్‌తో కలిసి పోటీ చేస్తే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతుంది. లేదంటే బహుముఖ పోటీలు ముందుకు వస్తాయి. మరి, మజ్లీస్‌కు దూరమై కెసిఆర్ టిడిపి, బిజెపితో అంతర్గతంగా ఏమైనా అవగాహనకు వస్తారా తెలియదు. ఇప్పటికిప్పుడైతే అది సాధ్యమయ్యేది కాదు. అయితే, హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికలు ముగిసిన తర్వాతనే టిఆర్ఎస్ ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
కానీ, ఇప్పటికే మోడీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరుతుందనే వార్తలు బలంగా వస్తున్నాయి. వాటిని కెసిఆర్ ఖండించడం లేదు. లేదా ఇతర నాయకులతో వాటిని ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇప్పించడం లేదు. ఈ ప్రచారం పెరిగి, అదే వాస్తవంగా స్థిరపడిపోయినా హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మైనారిటీలు టిఆర్ఎస్‌కు దూరం కావచ్చు. కెసిఆర్ వ్యూహం ఏమిటనేది పూర్తి తెలియడం లేదు. అయితే, అన్ని రకాల ప్రచారాలను జరగనిచ్చి, ఎవరు మాట్లాడేది వారిని మాట్లాడనిచ్చి, ఒక్కసారి జూలు విదిలించే లక్షణం కెసిఆర్‌కు ఉంది.
అనూహ్యమైన, సంచలనాత్మకమైన ప్రకటన చేసి, అందరి దృష్టినీ ఆకర్షించి, తాను చెప్పిన విషయమే ఎజెండా రాజకీయాల్లో నలిగి విధంగా చేసే చాతుర్యం ఆయనకు ఉంది. అదేమైనా చేస్తారేమో తెలియుదు.












Click it and Unblock the Notifications