ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు - తాజా సర్వే సంచలనం..!!
ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు. జగన్ వైనాట్ 175 నినాదం వర్కవుట్ అవుతుందా. టీడీపీ ధీమా నిజమం కానుందా. టీడీపీ..జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ అధికారం ఖాయమనే లెక్కల్లో రెండు పార్టీల నేతలు ఉన్నారు. ఎవరు ఎవరితో కలిసినా విజయం తమదేనని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వేలో ఏపీలో ఆసక్తి కర అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది వెల్లడించింది.
ఏపీలో వైసీపీదే హవా : ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ సీట్లు దక్కుతాయనే అంశం పైన ఈ సర్వే కొనసాగింది. దేశ వ్యాప్తంగా మోదీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మోదీకి వరుసగా మూడో సారి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేసింది.

ఏపీలో వైసీపీకే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని సర్వేలో స్పష్టం అయింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ-ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. దాదాపు గా వైఎస్సార్సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది.
జగన్ వై నాట్ 175 సక్సెస్ అయ్యేనా : 2019 ఎన్నికల్లో వైసీపీ ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో 22 గెలుచుకుంది. టీడీపీ మిగిలిన మూడు స్థానాలు దక్కించుకుంది. 23 లోక్ సభ స్థానాలు గెలిచిన వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఇప్పుడు తిరిగి దాదాపుగా అదే స్థాయిలో లోక్ సభ సీట్లు వైసీపీ గెలుచుకొనే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
దీని ద్వారా తిరిగి అసెంబ్లీ స్థానాల్లో అదే సంఖ్య రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు ఈ సర్వే ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎవరికి ఎవరితోనూ పొత్తులు లేకుండా విడి విడిగా పోటీ చేసారు. ఈ సారి ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా టీడీపీ ..జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ కలవకపోతే వామపక్షాలు ఈ రెండు పార్టీలతో కలిసే ఛాన్స్ కనిపిస్తోంది.
తిరిగి జగన్ కే అధికారం దక్కేనా : తాజా సర్వే ప్రకారం జగన్ ఇమేజ్ తగ్గలేదనే విధంగా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ప్రతీ ఇంటికి మంచి చేస్తున్నామని చెబుతూ ఎమ్మెల్యేలను లబ్దిదారుల వద్దకు పంపుతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు అండగా నిలవాలంటూ పిలుపు ఇస్తున్నారు.
ఈ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిస్తే ఈ సారి సామాజిక సమీకరణాల్లో మార్పు వస్తుందని..అవి వైసీపీని ఓడించేందుకు దోహదం చేస్తాయని విశ్లేషిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు ఈ తాజా సర్వే లెక్కలు ఏపీ రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారాయి.












Click it and Unblock the Notifications