పవన్ కల్యాణ్ నిర్ణయం వెనక...: స్టార్స్‌కు లింక్ (పిక్చర్స్)
ఏలూరు: జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ఓటు హక్కును ఏలూరులోనే నమోదు చేసుకుని అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. పశ్చిమ గోదావరి పవన్ కల్యాణ్ సొంత జిల్లా. ఆయన నిర్ణయం వెలువడిన మరుక్శణం నుంచి జనసేన కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.
తన సొంత ఊరు మొగల్తూరు గురించి, తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి పవన్ కల్యాణ్ పలుమార్లు వివిధ సభల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో ఓటుహక్కు నమోదు చేసుకుంటారని ఎవరికి కూడా ఊహకు అందలేదు.
సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుతూ వచ్చారు. కానీ ఆయన ఏనాడూ పెదవి విప్పలేదు. పవన్ కల్యాణ్ ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోబోతున్నానని, ఉండడానికి వీలుగా నివాసాన్ని ఇక్కడే చూసే బాధ్యతను కార్యకర్తలకే అప్పగించారని జనసేన ప్రతినిధి రాఘవ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మెగా హీరోలకు జిల్లాలో ఫాలోయింగ్
మెగా సోదరులకు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద యెత్తున ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ చిత్రాలు విడుదలైతే చాలు అభిమానులు చేసే సందడి మిన్నంటుతుంది. పవన్ కల్యాణ్ అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటారంటే ఆ సంబరం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రెండేళ్లకు పైగా గడువు ఉండాగనే నిర్ణయం...
ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నరేళ్ళ గడువు ఉంది. ఆ సమయంలో ఏలూరులో స్థిరపడేందుకు వీలుగా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. అసలు పవన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది అంతు పట్టడం లేదు.

తెలంగాణలో కాబట్టి మారాలని నిర్ణయమా..
పవన్ కల్యాణ్ ఏలూరులో నివాసం ఉండాలనే నిర్ణయంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అనేది అందులో ఓ ప్రశ్న. సొంత జిల్లాపై ప్రేమతో పని చేస్తున్నారా అనేది మరో ప్రశ్న. ఏలూరు వేదికగా ఇక ముందు పార్టీ వ్యవహారాలను నడపాలని ఆయన భావిస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. అందువల్ల తెలంగాణ నుంచి బయటపడే ఉద్దేశం కూడా ఆ నిర్ణయంలో ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూ తెలంగాణలో ఉండడం సరి కాదని ఆయన భావించి ఉండవచ్చునని అంటున్నారు.

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఓటు హక్కు
పవన్ కల్యాణ్‌కు హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు ఉంది. హైదరాబాదు నుంచి ఏలూరుకు మార్చుకోవడం వల్ల సొంత జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని కూడా ఆయన భావించి ఉండవచ్చు. ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అంకితమై పోతారనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందని ఆయన అనుకుంటూ ఉండవచ్చునని అంటున్నారు.

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తున్న కాలంలో సూపర్‌స్టార్ కృష్ణ ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన బోళ్ల బుల్లిరామయ్యపై అంతటి టిడిపి ప్రభంజనంలోనూ సూపర్‌స్టార్ కృష్ణ విజయం సాధించారు. సినిమా స్టార్లంటే తెగ అభిమానం చూపుతారనే మాట అప్పట్లో వినిపించింది.

చిరంజీవికి ఇలా ఎదురు దెబ్బ, ఆ తర్వాత...
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం స్థాపించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేశారు. ఆయనతో కాంగ్రెస్ అభ్యర్ధి బంగారు ఉషారాణి తలపడ్డారు. ఎవరూ ఊహించని రీతిలో తన సొంత గడ్డపై చిరంజీవి ఓటమి పాలయ్యారు. అయితే, ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మరుసటి ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మురళీమోహన్ రెండో సారి...
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో సినీ నటుడు మురళీ మోహన్ 2009 ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్‌పై ఓడిపోయారు. అయితే, 2014లో తిరిగి ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇలా..
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు నరసాపురం నుంచి ఒకసారి, కాకినాడ నుంచి ఇంకోసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వా ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఓటమి పొందారు.












Click it and Unblock the Notifications