రెడ్లపై నారా లోకేష్‌కు సడన్‌గా రొమాంటిక్ లవ్ ఎందుకు పుట్టుకొచ్చింది?
అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆయన ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. సహా పలువురు నాయకులపై చురకలు అంటిస్తుంటారు.
ఇటీవలే నిజం పేరుతో కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు ఆర్జీవీ. ఈ ఛానల్‌లో తొలి ఎపిసోడ్- వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం మీదే. వివేకా హత్య వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రబోధిస్తోన్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్లకు పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలను తవ్వి తీయడమే తన యూట్యూబ్ ఛానల్ నిజం ముఖ్యొద్దేశమంటూ లాంచింగ్ ప్రారంభంలోనే ప్రకటించారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కడపలో నారా లోకేష్ ప్రకటించిన మిషన్ రాయలసీమ గురించి ప్రస్తావించారు. సెటైర్లతో చెలరేగారు. మిషన్ రాయలసీమ వ్యవహారాన్ని ఓ జోక్‌గా అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల తరువాత నిద్ర లేచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాలు నిద్రపోయిన ఆయన ఇప్పుడు మేల్కొని రాయలసీమను అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడని విమర్శించారు. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో రాయలసీమను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
తనను రెడ్లు దత్తత తీసుకున్నారంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. రెడ్డి సామాజిక వర్గంపై నారా లోకేష్‌కు ఎందుకు అంత రొమాంటిక్ లవ్ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం కూడా ఆయనే ఇచ్చుకున్నారు. రెడ్డి మైనస్ రెడ్డి కమ్మకు ప్లస్ అవుతుందనేమోనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications