'సెక్షన్ 8పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు': బాబు విదేశీ పర్యటన
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్షన్ 8 పైన ఎందుకు స్పందించడం లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం నాడు నిలదీశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై రాజకీయం వద్దన్నారు. ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వైసీపీ అధ్యక్షులు జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో ఉమ్మడి సంస్థల ఆస్తులను వినియోగించుకునే స్వేచ్ఛ, హక్కు ఏపీకి ఉన్నాయన్నారు.

చంద్రబాబు విదేశీ పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై 5 నుండి 10వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన హాంకాంగ్, జపాన్‌లలో పర్యటిస్తారు. జూలై 6,7,8 తేదీల్లో జపాన్‌లో, జూలై 9,10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తారు.
జపాన్ ప్రధానిని అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. టోక్యోలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. జపాన్, హాంకాంగ్‌లలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయి, వారికి ఏపీలో పెట్టుబడులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.












Click it and Unblock the Notifications