రాజకీయం మలుపు తిరుగుతోందా, బాబు ఒంటరేనా: జగన్ సాఫ్ట్ వెనుక.. ఎవరెటు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 'రాజకీయం' మలుపు తిరుగుతోందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును కలవడం, ఇటీవల పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలపడం, ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రధాని మోడీ పైన ఘాటుగా విమర్శలు చేయకపోవడం చర్చకు తావిస్తోంది.
కొద్ది రోజుల క్రితం వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనాడు సంస్థల రామోజీ రావును కలిశారు. అనంతరం ఇటీవలే రామోజీ రావుకు పద్మవిభూషణ్ వచ్చింది. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలపడం సాధారణమే అయినప్పటికీ... అంతకు ముందు జగన్ కలవడం, ఇప్పుడు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. మరోవైపు, బుధవారం ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం చంద్రబాబు పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రధాని మోడీ పైన అంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదనే చెప్పవచ్చు.

జగన్ కేంద్రంతో సత్సంబంధాల కోసం చూస్తున్నారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి కంటే బిజెపికి ఎక్కువ బాధ్యత ఉందనడాన్ని ఎవరూ కాదనలేరు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి. మిగతా రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కూడా కేంద్రానిదే.
అదే సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాజ్యసభలోనే అయిదేళ్లు కాదని పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ తరిచి చూస్తే ప్రత్యేక హోదా... విషయంలో టిడిపి కంటే బిజెపినే లక్ష్యంగా జగన్ చేసుకోవాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా... ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కేంద్రంతో మంచిగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు, రామోజీ రావు మీడియా టిడిపి వైపు మొగ్గు చూపుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు బిజెపి వైపు కూడా కనిపిస్తున్నారని అంటున్నారు. తరిచి చూస్తే చంద్రబాబు ఒంటరి కాబోతున్నారా? అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications