సీమాంధ్ర రాజధానిపై కమిటీ కసరత్తు: రెండింటికి ఛాన్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాజధానిపై కసరత్తు ప్రారంభమైంది. రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ గురువారం న్యూఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో పికె మహంతి తదితరులు పాల్గొన్నారు. పదమూడు జిల్లాలపై చర్చించారు. మే 2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సీమాంధ్రలో పర్యటిస్తారు.
ఈ కమిటీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కెసి శివరామ కృష్ణన్, సభ్యులు డాక్టర్ రతిన్ రాయ్, అరోమర్ రెవి, జగన్ షా, ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్‌లు ఉన్నారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగిన సమావేశమై విధి విధానాలపై చర్చించారు.

ఏయే ప్రాంతాల్లో పర్యటించాలి? ఆయా ప్రాంతాల్లో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలపై ఒక పట్టికను రూపొందించారు. దాని ప్రకారం రాజధాని ఎంపికపై అధ్యయనం చేస్తారు. రాజధాని నిర్మాణానికి ఏ జిల్లాలో ఎంత మేరకు భూమి/ ప్రభుత్వ భూమి లభ్యమవుతుంది? నీటి లభ్యత ఎంత? మౌలిక, రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? మానవ వనరులు ఎంత మేరకు ఉన్నాయి? తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కమిటీ సమాచారాన్ని కోరింది.
సీమాంధ్ర మొత్తం పర్యటించి నాలుగైదు ప్రాంతాలను ఎంపిక చేస్తుందని, ఎంపిక చేసిన ప్రాంతాలపై కసరత్తు పూర్తి చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. సమావేశం తర్వాత శివరామ కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. తొలి సమావేశం ప్రాథమిక సమావేశమేనని, ప్రస్తుతం ప్రాంతాల గురించి చర్చించటం లేదని, వాటిని గుర్తించేందుకు ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపైనే చర్చిస్తున్నామని చెప్పారు.
తమది సాంకేతిక కమిటీ మాత్రమేనని, వాతావరణం, నీరు, భూమి వంటి సాంకేతికాంశాలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. అధ్యయనానికి కావాల్సిన సమాచారాన్ని పొందిన తర్వాత, దానిని పరిశీలించి, ఆ తర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళతామన్నారు.
తాము ఒక ప్రదేశాన్ని మాత్రమే సిఫార్సు చేస్తామా? లేక ఆప్షన్లు ఇస్తామా అన్నది తమకు అందే సాంకేతిక సమాచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాతే తాము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తామని స్పష్టం చేశారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు రెండు రాజధానిలు ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే రాజధాని కావడం వల్ల సీమాంధ్ర ప్రాంతం నష్టపోయిందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో అలాంటిది తలెత్తకుండా.. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేట్టు.. రెండు రాజధానిలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications