AP Cabinet: అదానీ ఒప్పందం రద్దు చేస్తారా? కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ !
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చే 25 ఏళ్ల పాటు 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో కుదుర్చుకున్న ఒప్పందం ఆప్పట్లోనే వివాదాస్పదమైంది. దీనిపై అప్పట్లోనే ప్రస్తుత ఆర్ధిక మంత్రి, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో ఈ వ్యవహారం తేలలేదు. కానీ ఏపీకి సౌర విద్యుత్ సరఫరా కోసం అదానీ గ్రూప్ తో సెకీ కుదుర్చుకున్న మరో ఒప్పందం ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఒప్పందం ముందుకెళ్లాల్సి ఉంది. కానీ మధ్యలో అదానీ సౌర ఒప్పందాలపై అమెరికా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.
అప్పట్లో భారత్ లోని వివిధ ప్రభుత్వాలకు సౌర విద్యుత్ సరఫరా కోసం కుదుర్చుకున్న ఒప్పందాల కోసం భారీగా ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ పై అమెరికా కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో భారత్ లో అదానీతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఇరుకునపడ్డాయి. ఇందులో ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు రూ.1750 కోట్లు ఇచ్చారని అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల నేపథ్యంలో అప్పట్లో సెకీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ రద్దు చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో గతంలో ఈ ఒప్పందాన్ని అప్పట్లో వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు దానిపై నోరు విప్పడం లేదు. మరోవైపు తన పేరు ఈ వ్యవహారంలో నేరుగా లాగడంపై జగన్ కూడా భగ్గుమంటున్నారు. అన్నింటికీ మించి అదానీ గ్రూప్ తో సెకీ కుదుర్చుకున్న ఒప్పందం రద్దుకు చంద్రబాబు సర్కార్ ముందడుగు వేస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. అయితే అప్పట్లో తప్పని చెప్పిన ఒప్పందం ఇప్పుడు ఒప్పు అని చంద్రబాబు ఒప్పుకుంటారా లేక దాన్ని రద్దు చేసి చిత్తశుద్ధి చాటుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే అంతిమంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications