బీజేపీ- టీడీపీ పొత్తు : పవన్ కు కీలక బాధ్యతలు - నేటి నుంచి ఆట మొదలు..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు. ఇప్పటికే టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ప్రధానితో పవన్ భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు టీడీపీ- బీజేపీతో కలిసి జనసేన పొత్తు తో ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈ రోజు తొలి అడుగు పడనుంది.

భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ
ఈ సమావేశంలోనే అన్ని అంశాలు క్లారిటీ రాకపోయినా.. తదుపరి సమావేశాలకు ఈ భేటీ నాంది కానుంది. ఇప్పుడు ఏపీ కంటే బీజేపీకి తెలంగాణ ప్రతిష్టాత్మకంగా మారుతోంది. తెలంగాణలోనూ మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. జనసేన - బీజేపీ పొత్తు ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణలోనూ సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ అధినాయకత్వం వ్యూహం. అందుకోసం ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధాని మోదీ జనసేనానిని ఢిల్లీకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. టీడీపీతో కలిసి పొత్తు పైన ఎన్నికలే ముందు నిర్ణయం తీసుకొనే ఆలోచనలో ఉందని ఒక వర్గం బీజేపీ నేతలు చెబుతుంటే.. టీడీపీతో ఇక పవన్ కూడా దూరం అవుతారని, టీడీపీతో పొత్తు అవకాశం లేదని మరి కొందరు కమలం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

పవన్ అంగీకరిస్తే..కీలక బాధ్యతలు
పవన్ కళ్యాణ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇందు కోసం అవసరమైతే పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో జగన్ ను అధికారానికి దూరం చేయాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారు. అందుకోసం ఏ అవకాశాన్ని విడుచుకోవటానికి సిద్దంగా లేరని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఏపీలో సామాజిక సమీకరణాల ఆధారంగా సాగుతున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత బీజేపీ గుర్తించింది. అందులో భాగంగానే..ఇప్పుడు ప్రధానితో భేటీ కూడా ఖరారు చేసారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తరువాత బీజేపీ లక్ష్యం తెలంగాణ గా చెబుతున్నారు.

ముందు తెలంగాణ..తర్వాత ఏపీపై
దీంతో..తెలంగాణ బీజేపీ నేతలకున్న అభ్యంతరాలను పక్కన పెట్టి..అక్కడ కూడా పవన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ ప్లాన్ గా ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ వ్యూహంతోనే ఇప్పుడు విశాఖ కేంద్రంగా తొలి సమావేశం జరగనుంది. ఇక, ఏపీలో బీజేపీ ఇప్పటికిప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించే అవసరం - అవకాశం కనిపించటం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ తమతో కటీఫ్ చెప్పి..చంద్రబాబుతో కలిసి వెళ్లకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. దీంతో..విశాఖ కేంద్రంగా ప్రధాని రెండు రోజుల పర్యటనలో ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ పైన ఒక స్పష్టత రావటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications