కొత్త బిల్లూ పెట్టక-సుప్రీంకు వెళ్లక-హైకోర్టు ధిక్కకరణకు సిద్ధమైన జగన్ సర్కార్ ! ఏం జరగబోతోంది ?
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి మూడేళ్లవుతున్నా దాన్ని పట్టాలెక్కించడంలో విఫలమైన వైసీపీ సర్కార్ కు ఈ విషయంలో అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తాజాగా అమరావతే రాజధాని,దానిపై అసెంబ్లీలో కొత్త చట్టాలు చేయడం కూడా కుదరదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి గట్టిగానే తాకినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లకుండా, ఇటు కొత్త బిల్లూ ప్రవేశపెట్టకుండా మధ్యేమార్గంగా ఎదురుదాడిని ఎంచుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

హైకోర్టు తీర్పుపై అసెంబ్లీ చర్చ
అమరావతి రాజధానిపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ చాలా అసహనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తాను తెచ్చిన మూడు రాజధానుల స్ధానంలో అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇఛ్చిన తీర్పు ఆయన్ను గట్టిగానే తాకినట్లు కనిపిస్తోంది. దీంతో అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉండగా.. అలా చేయకుండా అసెంబ్లీలోనే చర్చకు పెట్టారు. తద్వారా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జడ్డీల తీరును తప్పుబట్టారు. ఇది ఎక్కడికి దారి తీయబోతోందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

సుప్రీంకోర్టుకు వెళ్లకుండా
హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయని, మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని వాదించే అవకాశమూ ఉంది. అమరావతిలో అక్రమాలు జరిగాయని, కాబట్టి రాజధాని మార్చకతప్పదని ఆధారాలతో సహా నిరూపించేందుకు అవకాశం ఉంది. కానీ ఇవేవీ చేయకుండా అమరావతి రాజధాని కొనసాగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో తూర్పారబట్టాలని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య కొత్త సంఘర్షణకు దారి తీయబోతోంది.

మూడు రాజధానుల కొత్త బిల్లేదీ ?
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. వాటిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే వెనక్కి తీసుకుంది.తిరిగి ఈ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టి తీరుతామని పదే పదే చెప్పింది. కానీ జరిగింది వేరు.
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నప్పుడు అదే అసెంబ్లీకి ఉన్న అధికారాన్ని వాడుకుంటూ మూడు రాజధానులపై కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైకోర్టు వద్దన్నా అసెంబ్లీకి అధికారం ఉందని భావించినప్పుడు కొత్త బిల్లు ప్రవేశపెట్టడంపై వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ జగన్ సర్కార్ అలా చేయలేదు. కొత్త బిల్లు ప్రవేశపెట్టకుండా, అలాగని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేవలం అసెంబ్లీలో చర్చ పెట్టి రాజకీయ ఎదురుదాడి చేసి సరిపెట్టింది. తద్వారా హైకోర్టుకు అసెంబ్లీ అధికారాల్ని గుర్తు చేసేందుకు మాత్రమే జగన్ సర్కార్ పరిమితమైంది.

ధిక్కరణతో రాజ్యాంగ సంక్షోభం ?
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో అదే హైకోర్టును రివ్యూ కోరే అవకాశం ఉంది. కాదంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడా కుదరకపోతే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులు సదరు చట్టం రాజ్యాంగ బద్ధమాకాదా అన్నది ఎలాగో తేలుస్తాయి. కానీ ఇవేవీ చేయకుండా అసెంబ్లీ వేదికగా అమరావతి తీర్పు ఇచ్చిన హైకోర్టుపై, జడ్డీలపై విమర్శలు, వారి పరిధిని గుర్తుచేస్తూ వ్యాఖ్యలు, వారి ఎంపికపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రభుత్వం మరో ముఖాముఖీ పోరుకు తెరలేపిందా అన్న చర్చ జరుగుతోంది. అన్నింటికీ మించి హైకోర్టు తీర్పును అమలు చేయకుండా మూడు రాజధానులపై ముందుకెళ్తామని అసెంబ్లీలో ప్రకటించడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications