వెంకయ్య ప్రకటన: పవన్ కళ్యాణ్‌తో కవిత కలిసి పనిచేస్తారా?
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ప్రచారకులుగా కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రకటించిన పేర్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురూ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరు కలిసి పనిచేస్తారా అనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది.
గత ఎన్నికల ప్రచార సమయంలో వీరిద్దరు రాజకీయంగా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుని బద్ధ విరోధులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 18 మంది ప్రముఖులను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. వీరితో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

స్వచ్ఛ భారత్ మిషన్ రాజకీయ కార్యక్రమం కాదని వెంకయ్య నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. కేవలం ప్రభుత్వంతోనే స్వచ్ఛ భారత్ నిర్మాణం సాధ్యం కాదన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలు దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ భారత్‌కు సంబంధించి సినీ నటులు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక గురువులు, స్వచ్ఛంధ సంస్థలతో మాట్లాడినట్లు చెప్పారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఆ కార్యక్రమం గురించి మాట్లాడడం లేదు. కానీ, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మాత్రం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. తెలంగాణకు చెందిన సినీ హీరో నితిన్ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్దగా స్వచ్ఛ భారత్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని కల్వకుంట్ల కవిత ఎలా తీసుకుంటారు, అందులో పాల్గొంటారా అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. తెలంగాణలో బిజెపి బలాన్ని నిలువరించే ఎత్తుగడలో భాగంగా కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్గగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. సుపరిపాలనా దినోత్సవాన్ని కూడా ఆయన దూరమే పెట్టారు.












Click it and Unblock the Notifications