మోత్కుపల్లి శాంతించారా?: బాబు పిలిస్తే ఇప్పుడేకాదని..
హైదరాబాద్: రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై అలక చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శాంతించారట. తనకు రాజ్యసభ సీటు కేటాయించక పోవడంతో మోత్కుపల్లి సోమవారం రాత్రి చంద్రబాబు ఇంటి నుండి ఆగ్రహంతో వెళ్లిపోయారు. మంగళవారం ఆగ్రహంతో కనిపించారు. ఓ సమయంలో మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు.
అదే సమయంలో చంద్రబాబు నాయుడు పలువురు నేతలను మోత్కుపల్లి ఇంటికి పంపించి బుజ్జగింపులు చేశారు. విడతలవారీగా పార్టీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి సమాలోచనలు జరిపారు. మొదట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ ఎమ్మెల్యే ఎల్ రమణ, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయ రమణారావు, మరో ఎమ్మెల్యే విజయ రమణ రావు తదితరులు మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బుజ్జగించారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మరోసారి వారితో తన బాధను వ్యక్తం చేశారు. తనకు సర్దుబాటు చేసే పరిస్ధితి లేకపోతే కొంత ముందుగానే చెప్పి ఉంటే బాగుండేదని, కాని ఆఖరి నిమిషం వరకూ తేల్చకపోవడంతో తన ప్రతిష్ట దెబ్బతిందని ఆవేదన వెలిబుచ్చారట.
అయితే, మోత్కుపల్లికి ఇవ్వలేకపోయినందుకు చంద్రబాబు కూడా బాధపడుతున్నారని, కొన్ని సమీకరణాల వల్ల ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఆలోచన లేదని పార్టీ నేతలు ఆయనకు నచ్చజెప్పారు. దానికి ఆయన కొంత శాంతించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతారని అనుకున్నారు. కానీ నేతలు వచ్చి కలవడంతో ఆయన మీడియా ముందుకు రాలేదు. దీంతో ఆయన కొంత చల్లారినట్లుగా కనిపిస్తోందంటున్నారు.
మరోవైపు వచ్చి తనను కలవాలని చంద్రబాబు కొందరు నేతల ద్వారా ఆయనకు కబురు చేశారట. దానికి మోత్కుపల్లి తాను ఇప్పుడే రాలేనని, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. మోత్కుపల్లి చాలా బాధపడుతున్నారని కానీ ఆవేశం తగ్గిందని, సీనియర్ నేత కాబట్టి కొంత మనస్తాపం ఉండటం సహజమేనని ఆయనను కలిసిన కొందరు చెబుతున్నారట.
వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసినా పార్టీ అంతా కలిసి పని చేస్తామని ఆయనకు నేతలు సూచించారట. లేకుంటే వచ్చే దఫా రాజ్యసభ స్థానాన్ని మోత్కుపల్లికే ఇస్తామని సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు వేటి పైనా మోత్కుపల్లి ఆసక్తి చూపలేదట. అయితే, నేతల మాత్రం మోత్కుపల్లి కొంత చల్లారినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications